Friday, September 20, 2024

సినీ ఇండస్ట్రీపై రేవంత్ ఆగ్రహం..వెంటనే స్పందించిన చిరంజీవి

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో గద్దర్ అవార్డుల అంశం మరోసారి హాట్ టాపిక్ అయింది. గద్దర్ అవార్డులు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనా సినీ పరిశ్రమ ఆసక్తి చూపించలేదని రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడంతో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని, సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ సినీపరిశ్రమలోని ప్రతిభావంతులకు, ప్రజా కళాకారుడు గద్దర్ గారి పేరు మీదుగా ప్రతియేటా ’గద్దర్ అవారడ్స్’ తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించిన తరువాత, తెలుగు పరిశ్రమ తరపున, ఫిలిం ఛాంబర్ మరియు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లేలా బాధ్యత తీసుకోవాలని కోరారు.

గతంలో నంది అవార్డు స్థానంలో గద్దర్ అవార్డ్ ప్రకటన
గత జనవరిలో రవీంద్రభారతిలో జరిగిన గద్దర్ జయంతి కార్యక్రమంలో నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా ప్రకటిస్తూ రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. నంది అవార్డులు పునరుద్ధరించాలని సినిమా వాళ్లు అడిగారని. నంది అవార్డులు కాదు.. మా ప్రభుత్వం కచ్చితంగా అవార్డులు ఇస్తుందని చెప్పానన్నారు. గద్దర్ అవార్డుల పేరుతో పురస్కారాలు ఇస్తామని కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ఇచ్చే అధికారిక అవార్డు లకు గద్దర్ అవార్డు ఇస్తామని ప్రకటించారు. తన మాటే జీవో అని కూడా ప్రకటించారు. అయితే సినీ పరిశ్రమ వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ముందడుగు పడలేదు. ఇప్పుడు మరోసారి ఆయన స్పందించడం చిరంజీవి చొరవ తీసుకోవడంతో త్వరలో సినీ పరిశ్రమ నుంచి ఓ బృందం ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది.

సిఎం రేవంత్ అపాయింట్‌మెంట్ ఇస్తే మాట్లాడడానికి రెడీ : తమ్మారెడ్డి భరద్వాజ
నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా మార్చుతామని గతంలో సిఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము సిఎం రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించామని రెండు, మూడుసార్లు అపాయింట్‌మెంట్ కోసం అడిగామని కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. సిఎం రేవంత్ అపాయింట్‌మెంట్ ఇస్తే వెళ్లి మాట్లాడటానికి రెడీగా ఉన్నామని ఆయన తెలిపారు. గద్దర్ గొప్ప వ్యక్తి ఆయన పేరుమీద అవార్డులు తీసుకోవడానికి ఎవరికీ అభ్యం తరం లేదని ఆయన ప్రకటించారు.

కాగా, అంతకుముందు గద్దర్ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు తెలుగు చిత్ర పరిశ్రమ స్పందన లేకపోవడంపై సిఎం రేవంత్ రెడ్డి అసంతృప్తికి లోనయ్యారు. సోమవారం సాయంత్రం సినారె జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అవార్డుల కార్యక్రమంలో సిఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమపై తొలిసారి అసంతృప్తి వెళ్లగక్కారు. ఈ ఏడాది జనవరిలో నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా మారుస్తామని ఆయన ప్రకటించారు. గద్దర్ అవార్డుల కార్యక్రమాన్ని ఎలా అమలు చేయాలన్న దానిపై అభిప్రాయాలు, సూచనలు అందించాలని మరోసారి పరిశ్రమ పెద్దలకు సూచనలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News