హైదరాబాద్: ఎస్‌సి వర్గీకరణ కోసం మాదిగ, మాదిగ ఉపకులాల యువకులు 27 ఏళ్లుగా పోరాటం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో మాదిగ, మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం తాను, సంపత్ వాయిదా తీర్మానం కూడా ఇచ్చామని, వాయిదా తీర్మానాన్ని ఇచ్చిన మమ్మల్ని సభ నుంచి బహిష్కరించారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఎస్‌సి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో శాసన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. గత ప్రభుత్వం ఎస్‌సి వర్గీకరణ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు అఖిలపక్షం తీసుకెళ్తామని చెప్పిందని, కానీ కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకుపోకుండా మోసం చేసిందని దుయ్యబట్టారు.
సుప్రీంకోర్టులో ఎస్‌సి వర్గీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించిందన్నారు. ఎస్‌సి వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ప్రశంసించారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. దేశంలోనే అందరికంటే ముందే ఎస్‌సి వర్గీకరణను తెలంగాణలో అమలు చేస్తామని, ఇప్పుడిచ్చిన నోటిఫికేషన్లలో వర్గీకరణ అమలు చేస్తామన్నారు. ఇప్పుడిచ్చిన నోటిఫికేషన్లలో ఆర్డినెన్స్ తీసుకువచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేయడంతో పాటు ఎస్‌సి వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాలని సభను కోరుతున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు.