హైదరాబాద్: దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్‌ను పరిచయం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నేదురుమల్లి జనార్థన్ రెడ్డి సిఎంగా ఉన్నప్పుడు హైటెక్‌సిటీలో ఐటికి పునాది రాయి వేశారని గుర్తు చేశారు. స్కిల్ వర్సిటీ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. హైదరాబాద్‌లో ఐటిరంగ నిపుణుల తయారీకి కాంగ్రెస్ కృషి చేసిందని, కాంగ్రెస్ వేసిన పునాదిరాయితో హైదరాబాద్‌లో ఐటి రంగం వేళ్లూనుకుందని, ప్రపంచంలో భారత ఐటి నిపుణుల్లో ఐదుగురు భారతీయులు ఉన్నారని, అందులో ఒకరు తెలుగు వారు ఉన్నారని కొనియాడారు. విద్య, నీటిపారుదలకు దివంగత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మొదటి ప్రాధాన్యత ఇచ్చారని, మారుమూల ప్రాంతాల్లో విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశారని, ప్రతి పేదవాడికి విద్య అందాలన్న లక్షంతో రిజర్వేషన్లు తీసుకొచ్చామని, రెసిడెన్షియల్ స్కూళ్ల ద్వారా పేదలకు విద్యను అందుబాటులోకి తెచ్చామని ఆయన తెలియజేశారు.
ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో అభివృద్ధి పథంలో నడిపించేందుకు నెహ్రూ పునాది వేశారని, ఎస్‌సి, ఎస్‌టిలకు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఉపాకల వేతనాలు అందించారని ప్రశంసించారు. ఇందిరాగాంధీ ప్రభుత్వరంగ సంస్థలను నెలకొల్పారని, ఎస్‌సి, ఎస్‌టిలకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని మెచ్చుకున్నారు. రైల్వే వ్యవస్థ, ఎల్‌ఐసి, రక్షణ రంగం, విమానయాన సంస్థల్లో ఉద్యోగాలు కల్పించారని రేవంత్ పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ రాజకీయ పాచికతో సభను స్తంభింపజేయడం సరికాదని, అక్కలను అడ్డంపెట్టుకొని బిఆర్‌ఎస్ రాజకీయ చేస్తుందని మండిపడ్డారు. ఎంఎల్‌ఎలు సబితా ఇంద్రారెడ్డి, సునీత మహేంద్రారెడ్డిని సొంత అక్కలుగానే భావించానని, ఒక అక్క తనని నడిబజారులో వదిలేసినా ఏం అనలేదని, ఇంకొక అక్క కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్తె తనపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారని, ఇప్పటికీ ఈ కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నానని రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు.