Saturday, November 23, 2024

ఇది జాతీయ విపత్తు: వయనాడ్‌లో రాహుల్, ప్రియాంక పర్యటన

- Advertisement -
- Advertisement -

వయనాడ్(కేరళ): వయనాడ్‌ను అతలాకుతలం చేసిన కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలను జాతీయ విపత్తుగా లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఈ ఘోర దుర్ఘటనలో కుటుంబ సభ్యులను, ఇళ్లను కోల్పోయిన వారి ఆవేదన వర్ణాతీతమని ఆయన అన్నారు. గురువారం తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రతో కలసి ఆయన వయనాడ్‌లోని ప్రకృతి బీభత్సానికి గురైన ప్రాతాలను సందర్శించారు. ఇది వయనాడ్‌కు, కేరళకు, యావద్ దేశానికే ఘోర దుర్ఘటనని ఆయన పేర్కొన్నారు.

తన దృష్టిలో ఇది జాతీయ విపత్తని, అయితే ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలని విలేకరులతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. వయనాడ్‌లోని చూల్‌మల ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ఇక్కడి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసేందుకే తాము వచ్చామని, ప్రజలు తమ కుటుంబ సభ్యులను, ఇళ్లను కోల్పోవడం చాలా విచారకరమని రాహుల్ అన్నారు. బాధితులను ఎలా ఓదార్చాలో తనకు అర్థం కావడం లేదని, ఈ పరిస్థితిలో వారిని పలకరించడం కూడా చాలా కష్టమని ఆయన తెలిపారు. ఇది తనకు అత్యంత కష్టమైన రోజని, ఈ విపత్తు నుంచి ప్రాణాలతో బయటపడినవారిని ఆదుకోవడానికి తన వంతు కృషి తాను చేస్తున్నానని ఆయన తెలిపారు. ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ఇక్కడి ప్రజలకు వచ్చిన కష్టం ఎవరూ ఊహించనిదని అన్నారు. వారిని ఆదుకుని వారికి అండగా నలిబడడేందుకు ప్రయత్నిస్తున్నామని ఆమె చెప్పారు.

మేప్పాడిలోని ఆసుపత్రిని, కమ్మూనిటీ హెల్త్ సెంర్‌ను, రెండు సహాయ శిబిరాలను రాహుల్, ప్రియాంక సందర్శించారు. ఈ కష్టకాలంలో వయనాడ్ ప్రజలకు అండగా తాను, ప్రియాంక నిలబడతామని, సహయ, రక్షణ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నామని, బాధితులకు అవసరమైన సహాయాన్ని అందచేస్తున్నామని రాహుల్ తెలిపారు. బాధితులకు అండగా యుడిఎఫ్ నిలబడుతుందని ఆయన చెప్పారు. వరుసగా జరుగుతున్న కొండ చరియలు విరిగిపడిన ఘటనలు, ప్రకృతి విపత్తులు చాలా ఆందోళన కలిగిస్తున్నాయని, ఇందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక తక్షణ అవసరమని ఎక్స్ పోస్టులో రాహుల్ పేర్కొన్నారు. చూరల్‌మలను చేరుకున్న అనంతరం రాహుల్, ప్రియాంక రెయిన్‌కోట్లు ధరించి తాత్కాలికంగా నిర్మించిన చెక్క వంతెనపై నుంచి నడిచి కొత్తగా నిర్మిస్తున్న బెయిలీ వంతెనను తిలకించారు.

బురదతో నిండిపోయిన ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మేప్పాడిలోని డాక్టర్ మూపెన్స్ మెడికల్ కాలేజ్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను సందర్శించి అక్కడ రిశీతల పేటికలలో భద్రపరిచిన మృతదేహాలను సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారి వెంట అళప్పుళ ఎంపి, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. 2019లో వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన రాహుల్ 2024 ఎన్నికలలో కూడా ఇక్కడి నుంచి గెలుపొందారు. అయితే రెండు స్థానాలలో పోటీ చేసిన రాహుల్ రాయ్‌బరేలి స్థానాన్ని ఉంచుకుని వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News