ఎస్‌సి వర్గీకరణ కోసం మాదిగ, మాదిగ ఉపకులాల యువకులు 27 ఏళ్లుగా పోరాటం చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గురువారం శాసనసభ లో సిఎం కీలక ప్రకటన చేశారు. ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణను అమలు చేసేందుకు అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేస్తామని చెప్పారు. అందరికంటే ముందు భాగాన నిలబడి ఎబిసిడి వర్గీకరణ చేసే బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
మాదిగ, మాదిగ ఉపకులాల వర్గీకరణకు అందరూ సంపూర్ణంగా సహకరించాల్సిందిగా ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేశారు. వర్గీకరణ కోసం గతంలో ఇదే శాసనసభలో వాయిదా తీర్మానం ఇచ్చామని, అప్పుడు తనతో పాటు సంపత్‌కుమార్‌ను సభ నుంచి బ హిష్కరించారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఎబిసిడి వర్గీకరణ అంశంపై ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తామని చెప్పిందని, అలా తీసుకెళ్లకుండా మాదిగ సోదరులను మోసం చేశారని ఆరోపించారు.
2023, డిసెంబర్ 3న ప్రజాప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క సూచన మేరకు మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో శాసనసభ్యు లు, అడ్వొకేట్ జనరల్ (ఎజి)ని ఢిల్లీకి పంపించామని, న్యాయకోవిదులతో చ ర్చించి వర్గీకరణపై సుప్రీంకోర్టులో బలమైన వాదనను కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించిందని తెలిపారు. ఈ క్రమంలోనే ఉపవర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిన సర్వోన్నత న్యాయస్థానానికి సిఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎస్‌సి వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సిం హ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవడంతోనే న్యాయం ధర్మం గెలిచిందని చెప్పారు. రాజ్యాంగ ఫలాలు అందరికి అందాలనే తమ కల సాకారం అయిందని ఎంఎల్‌ఎ కడియం శ్రీహరి అన్నారు.