Tuesday, November 5, 2024

టీచర్లే బ్రాండ్ అంబాసిడర్‌లు: సిఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిది
టీచర్లు బ్రాండ్ అంబాసిడర్‌లు
టీచర్లు తేనేటీగల లాంటి వాళ్లు, ఎవరి జోలికి వెళ్లరు…వాళ్ల జోలికి వెళితే ఏం జరుగుతుందో తెలుసు…
గత పదేళ్లలో ప్రొఫెసర్ కోదండరాం, హరగోపాల్, చుక్కా రామయ్యలకు సరైన గౌరవం దక్కలేదు
ఉపాధ్యాయుల సమస్యలు వినేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధమే
వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు హయాంలో టీచర్లకు చాలా గౌరవం ఉండేది
పదేళ్లలో బిఆర్‌ఎస్ విద్యా వ్యవస్థను నాశనం చేసింది
ఎల్బీ స్టేడియంలో టీచర్లతో ముఖాముఖీలో సిఎం రేవంత్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని, వారే తమకు బ్రాండ్ అంబాసిడర్‌లని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో టీచర్లతో ఆయన ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. టీచర్లు తేనేటీగల లాంటి వాళ్లు అని, ఎవరి జోలికి వెళ్లరని, ఇక వాళ్ల జోలికి వెళితే ఏం జరుగుతుందో అందరికీ తెలుసని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ సమయంలో తెలంగాణ వస్తే విద్యావిధానం బాగుపడుతుందని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు.

గత పదేళ్లలో ప్రొఫెసర్ కోదండరాం, హరగోపాల్, చుక్కా రామయ్య సహా అనేకమందికి సరైన గౌరవం దక్కలేదన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు వినేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధమేనని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే 24వేల మంది పదోన్నతులు కల్పించినట్లు ఆయన తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు హయాంలో టీచర్లకు చాలా గౌరవం ఉండేదని ఆయన గుర్తుచేశారు. పదేళ్లలో బిఆర్‌ఎస్ విద్యా వ్యవస్థను నాశనం చేసిందని ఆయన మండిపడ్డారు. గుంటూరు, ఫుణెలో చదివానని ఒకాయన అసెంబ్లీలో చెప్పారని, కానీ, తాను ప్రభుత్వ పాఠశాలలో చదివానని చెప్పుకునేందుకు గర్వపడుతున్నానని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ టీచర్లు చదువు చెబితేనే తాను ఈ స్థాయికి వచ్చానని ఆయన తెలిపారు.

ఈ బడ్జెట్‌లో విద్యకు రూ.21వేల కోట్లకుపైగా బడ్జెట్
30వేల ప్రభుత్వ పాఠశాలల్లో 26లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు వారి భవిష్యత్‌ను మీ చేతుల్లో పెట్టారని సిఎం రేవంత్ అన్నారు. ఈ బడ్జెట్ లో విద్యకు 10శాతం కేటాయించాలని భావించామని, కానీ, హామీల అమలు దృష్ట్యా 7.3శాతం అంటే రూ.21వేల కోట్లకు పైగా కేటాయించామన్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 30వేల పాఠశాలల్లో 26లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు.

10వేల ప్రైవేటు పాఠశాలల్లో 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, ప్రైవేటు పాఠశాలలల్లో మీకంటే గొప్ప టీచర్లున్నారా? మౌలిక సదుపాయాలు లేకపోవడమే ఇందుకు కారణం కావచ్చా, తెలంగాణలో ఉద్యోగుల పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో కంటే దారుణంగా ఉందని, ఇది కఠోర నిజమని సిఎం రేవంత్ అన్నారు. ప్రభుత్వంపై ఉద్యోగులకు నమ్మకం కలిగించేందుకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. పదిహేనేళ్లుగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల పదోన్నతుల అంశాన్ని పరిష్కరించామన్నారు. మీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. టీచర్లంతా 90శాతం పైగా నిబద్ధతతో పనిచేయాలని, విద్యార్థులకు విద్యనందించాలని, గతేడాదికంటే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 2లక్షలకుపైగా విద్యార్థుల అడ్మిషన్లు తగ్గాయని ఆయన తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లడం ఆత్మగౌరవమని భావించేలా తీర్చిదిద్దాలి
ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లడం ఆత్మగౌరవమని భావించేలా తీర్చిదిద్దాలని సిఎం రేవంత్ సూచించారు. ప్రభుత్వం వైపు నుంచి మీ సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు తమకు ఎలాంటి భేషజాలు లేవన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు స్వయం సహాయక మహిళా సంఘాలకు బాధ్యత అప్పగించామని సిఎం రేవంత్ తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో మహిళలకు బాధ్యత అప్పగించామని, ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించామని ఆయన తెలిపారు. తెలంగాణ బలపడాలంటే మనందరం కార్యదీక్షతో పనిచేయాలన్నారు.

క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రాల్లో మినీ స్టేడియంల ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. నైపుణ్యం లేకపోవడం వల్లే నిరుద్యోగం పెరుగుతోందని, అందుకే ముచ్చెర్లలో 50 ఎకరాల్లో రూ.150 కోట్లతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకున్నామన్నారు. స్కిల్ యూనివర్సిటీలో యువకులకు నైపుణ్యంతో పాటు ఉద్యోగ, ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు స్పోర్ట్ పాలసీని తీసుకొస్తామని, మీరు నేర్పే విద్యనే రేపటి తెలంగాణ భవిష్యత్‌కు బాటలు వేస్తుందని, పేద విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే మీ లక్ష్యం కావాలని సిఎం రేవంత్ సూచించారు.

రూ.1,100 కోట్లతో అన్ని స్కూళ్లకు మౌలిక సదుపాయాలు: మంత్రి పొన్నం
రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దశాబ్దకాలం తరువాత జీవితంలో పదోన్నతులు వస్తాయో రావో అన్న భయం నుంచి పదోన్నతులు పొందిన ఉపాధ్యాయ వర్గానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుపడాలని, అధ్యాపక వ్యవస్థ అసంతృప్తి నుంచి బయటకు తీసుకురావడానికి ఈ పదోన్నతుల నిర్ణయం తీసుకున్నారన్నారు.

గతంలో పదోన్నతులు అంటే కోర్టులు అంటూ ఇబ్బందులు ఉండేవని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నియమ, నిబంధనల ప్రకారం పదోన్నతులు జరిగాయన్నారు. 25 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు, 35 వేల మంది ఉపాధ్యాయులకు బదిలీలు ఒకేసారి చూసి ఇతర డిపార్ట్‌మెంట్‌లు చూసి ఆశ్చర్య పోతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని వచ్చాం ప్రజా పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో రూ.1,100 కోట్లతో అన్ని స్కూళ్లకు మౌలిక సదుపాయాల కల్పించామన్నారు. ప్రతి స్కూల్ లో మౌలిక సదుపాయాలు, భవన నిర్మాణాలు 11,500 ఉపాధ్యాయ నియామకాలకు ఇప్పటికే పరీక్షలు నిర్వహించామన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News