Saturday, November 23, 2024

మారిస్తే, ముందు గుజరాత్ పేరు మార్చాలి!

- Advertisement -
- Advertisement -

గుర్జర్లు లేదా గుజ్జర్లు నివసించే ప్రాంతమే గుజరాత్ అయ్యింది. పశుపాలన, వ్యవసాయం ఒకప్పుడు వీరి వృత్తి. గుర్జర్లు అనేది ఒక కులానికో, ఒక మతానికో సంబంధించింది కాదు. వివిధ మతాల, వివిధ భాషల సమూహం. వీరిలో హిందువులు, ముస్లింలు, సిక్కులూ ఉన్నారు. వీరు గోజ్రి, గుజరాతి, హిందీ, కశ్మీరీ, పంజాబి, ఉర్దూ, పాస్తో, హరియాణవీ, సింధి, భోజ్‌పురి, మరాఠీ, బెలూచి వంటి అనేక భాషలు మాట్లాడుతారు. ఇండియా, పాకిస్థాన్, అఫ్ఘానిస్తాన్ దేశాల్లోకి వ్యాపించారు. వీరిలో రాజపుత్రులు, జాత్‌లు, ఆహిర్లు, ఇండో ఆర్యన్లు కలగాపులగంగా ఉన్నారు. ఇప్పుడు రాజస్థాన్ ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు (సా.శ. 570) గుర్జర్ల రాజ్యం ఉండేది.

ఈ గుర్జర అనే పదం మొట్టమొదట బాణుడి హర్షచరిత్ర (సా.శ 630) లో కనిపిస్తుంది. హర్షచక్రవర్తి కాలంలో భారత్‌లో పర్యటించిన చీనీ యాత్రికుల రచనల ప్రకారం ఆ రోజుల్లో ఆ ప్రాంతాన్ని ‘బుద్ధదేశ్’ అని పిలిచేవారు. కాలక్రమంలో అక్కడ అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సాధారణ శకం ప్రారంభం నుంచే అక్కడ ‘భిన్నత్వంలో ఏకత్వం’ ఇంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటే, ఇప్పుడేమిటి ఈ గుజరాతీ దేశ నాయకులు భిన్నత్వాన్ని నాశనం చేయడానికి పూనుకున్నారూ?

భారత దేశాన్ని పరిపాలించిన మొఘల్ చక్రవర్తుల జాబితా చూస్తే, మొదట మనకు తైమూర్ కనిపిస్తాడు. అతని కొడుకు బాబర్, బాబర్ కొడుకు హుమాయూన్, హుమాయూన్ కొడుకు అక్బర్ ద గ్రేట్. అక్బర్ తర్వాత జహంగీర్, షాజహాన్, ఔరంజేబ్, బహద్దూర్ షా జఫర్‌లు ఈ దేశాన్ని పరిపాలించారని చిన్నప్పుడు మనం చరిత్ర పాఠాల్లో చదువుకున్నాం. రాబోయే తరాలు ఈ విషయాలు తెలుసుకోగలరో లేదో తెలియదు. ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వం పాఠ్య పుస్తకాల్లోని విషయాలు మార్చేస్తోంది. అసలు మొఘలుల చరిత్రే ఎవరూ చదువుకోకూడదన్నది వారి ఉద్దేశం. వీళ్ళకు ముస్లింలంటే ఎందుకంత ద్వేషమో తెలియదు. కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్య నేతలు, అధికారులు అందరూ దాదాపు గుజరాతీ వారే. ఈ దేశవాసులైనందుకు, మనుషులైనందుకు మనం అందరినీ ప్రేమిస్తాం. గౌరవిస్తాం. కాని మన మీద అంటే వారి భావజాలాన్ని ఆమోదించని వారి మీద ఎందుకంత అక్కసో తెలియదు.

గుజరాత్ వారు గతంలో కొన్ని శతాబ్దాల పాటు ముస్లిం పాలకుల ఏలుబడిలో ఉన్నారు. ముస్లిం పాలకులు వీరిని పీడించిన విషయం చరిత్రలో ఎక్కడా నమోదు కాలేదు. సరే, ఈ విషయాలు అలా ఉండనిచ్చి మొఘలుల వివరాల్లోకి వెళ్లితే, ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అందరిలోకి అక్బర్ అక్బర్ ద గ్రేట్ అనిపించుకున్నాడు. ఎందుకంటే ఆయన పాటించిన పరమత సహనం, హిందూ రాజపుత్ర స్త్రీని వివాహ మాడడం, హిందువుల ఆధ్యాత్మిక రచనలు ఉర్దూలోకి అనువదింపజేసుకుని విషయాలు తెలుసుకోవడం అలాగే భారతీయ సంస్కృతిలో భాగమైన ‘భిన్నత్వంలో ఏకత్వాన్ని’ కాపాడడానికి ఇతోధికంగా కృషి చేయడం వంటివి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.

ఇక గుజరాత్ ప్రాంతానికి సంబంధించిన చరిత్ర చూద్దాం గుజరాత్ జూనాఘడ్ శిలా ఫలకాల వల్ల సా.శ 45 శతాబ్దాలలో ఇది బౌద్ధుల రాజ్యం అని తేలింది. తర్వాత సా.శ 89 శతాబ్దాల నాటికి అది గుర్జర్ల ప్రతీహారుల పాలన కిందికి వచ్చింది. తర్వాత సోలంకి, వాఘేలా వంశపు రాజులు పాలిస్తూ వచ్చారు. 1299 సా.శ లో ఢిల్లీ సుల్తాన్ అలాఉద్దీన్ ఖిల్జీ, అప్పటి వాఘేలా రాజును ఓడించి, గుజరాత్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అప్పడి నుండి అంటే 13 వ శతాబ్దం నుండి అది ముస్లింల పాలన కిందే ఉండిపోయింది. తర్వాత 1411లో అహ్మద్ షా అనే రాజు తన పేర అహ్మదాబాద్ నగరం ఏర్పాటు చేసుకుని, అక్కడి నుంచి పాలించాడు. 16వ శతాబ్దం చివరి నాటికి ఆ ప్రాంతమంతా మొఘలుల ఆధీనంలోకి వచ్చింది.

18వ శతాబ్దపు మధ్యలో మరాఠాలు ఏదో కొద్ది కాలం స్వాధీనం చేసుకున్నారు. కాని, 1818 నాటికి గుజరాత్ ప్రాంతం బ్రిటీష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోకి వచ్చింది. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గుజరాత్ ప్రావినెన్స్‌ను బొంబాయి స్టేట్‌లో కలిపారు. 1956 లో కచ్, సౌరాష్ట్రలు కూడా అందులో కలిశాయి. అయితే 1 మే 1960న బొంబాయి స్టేట్ విడిపోయి గుజరాత్, మహారాష్ట్రలుగా ఏర్పడ్డాయి. భాషల ఆధారంగా దేశంలో రాష్ట్రాల విభజన జరుగుతూ వస్తున్న కారణంగా గుజరాతీ, మరాఠీ భాషలు మాట్లాడేవారు విడిపోయారు.

మొఘల్ చక్రవర్తి అక్బర్ పాలిస్తున్న సమయంలో ఈ ‘గుజరాత్’ అనే పదం రూపుదిద్దుకుందని ‘జహంగీర్ నామా’లో ఉంది. దీని హిందీ అనువాదం మున్షీదేవీ ప్రసాద్ కృత్ చేశారు. అందులోని 51 పేజీలో పూర్తి వివరాలు ఉన్నాయి. జహంగీర్ చక్రవర్తి మాత్రమే కాదు, రచయిత కూడా! ఆయన తన ఆత్మకథను ‘తుజుక్ ఎ జహంగీర్’ పేరుతో రాసుకున్నాడు. అదే ‘జహంగీర్ నామా’ గా ప్రసిద్ధి పొందింది. దీని ఇంగ్లీష్ అనువాదం వీలర్ యం.తాక్‌స్టన్ చేశారు. జహంగీర్ నామాలో అక్బర్ ప్రసక్తి, ఆయన కట్టించిన కోట ప్రసక్తీ ఉన్నాయి. అక్బర్ ఒకసారి కశ్మీర్‌కు ప్రయాణమైపోతూ మార్గమధ్యంలో చీనాబ్ నది ఒడ్డుకు వచ్చాడు. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణానికి పరవశించిపోయి, అక్కడ ఒక ఖిల్లా (కోట) కట్టించుకుంటే బావుంటుందనుకున్నాడు. అనుకున్నదే తడవుగా నిజంగానే అక్కడ కోట కట్టించాడు.

ఆ ప్రాంతంలో గుర్జర్ల / గుజ్జర్ల జనాభా అధికం కాబట్టి దాన్ని ఆయన గుజరాత్ అన్నాడు. కొన్ని శతాబ్దాలు గడిచిన తర్వాత, ఆ ప్రాంతంలో దారి దోపిళ్లకు పాల్పడే వారిని ‘గుజ్జర్లు’ అనేవారు. అక్బర్ కట్టించిన ఆ కోట, పరిసర ప్రాంతాలు గుజ్జర్లు తలదాచుకోవడానికి పని కొచ్చింది. అయితే ఇండియా పాకిస్తాన్‌ల విభజన సమయంలో ఆ కోట, ఆ పరిసర ప్రాంతాలూ పాకిస్తాన్‌లోకి వెళ్లిపోయాయి. మిగిలిన గుజరాత్, భారత్‌లో మహారాష్ట్రతో కలిసి ఉండేది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు విడిపోయినప్పుడు గుజరాత్ మహారాష్ట్ర విడిపోయాయి.

మొఘలులంటే, ముస్లింలంటే మండిపడే ఆర్‌ఎస్‌ఎస్‌బిజెపి ప్రభుత్వం తక్షణం గుజరాత్ పేరు మార్చుకోవాలి కదా? ఎందుకంటే, ఆ ప్రాంతాన్ని గుర్తించి, దానికి ఆ పేరు పెట్టిన వారు అక్బర్ చక్రవర్తి. ఆ ప్రాంతంలో ఉన్న గుర్జర్ల గుజ్జర్ల జనాభాకు ప్రాధాన్యమిచ్చి ఆ పేరుకు రూపకల్పన చేయడమే కాకుండా, దాన్ని ఒక ప్రత్యేక పరగణాగా కూడా ప్రకటించాడు. మరి అక్బర్‌పై తమ కోపం ప్రకటించాలంటే తక్షణం గుజరాత్ పేరు మార్చాలి. లేదా దేశంలో ఇటీవల మార్చి, కొత్తగా పెట్టిన పేర్లను రద్దు చేయాలి. పాత పేర్లను యథాతథంగా ఉండనీయాలి. జహంగీర్ నామా 2225 పేజీలలో ఉన్న సమాచారం ప్రకారం హిందూ రాజులు మొఘలులకు అణిగిమణిగి ఉన్నవారే. కుచ్‌వాహ్ రాజ్‌పుత్ మాన్‌సింగ్ కుటుంబం మూడు తరాలుగా మొఘలుల సేవలో నిమగ్నమై ఉన్నారు. మాధవ్ సింగ్ జగన్నాథ్, రాజా మనోహర్, రాణా సాగర్, రాజా బీర్ సింహ్ దేవ్ మొదలైన వారంతా మొఘలుల వద్ద గులాంగిరి చేసిన వారే. ఆనాటి మొఘల్ చక్రవర్తులతో సత్సంబంధాలు నెలకొల్పుకుని, తమ ఆడబిడ్డల్ని వారికిచ్చి పెండ్లి చేయడానికి ఉత్సాహపడ్డవారే మరి, వారి వారసులే ఇప్పుడు ముస్లిం విరోధులు ఎందుకయ్యారూ? అన్నది మన ప్రశ్న! ఆత్మవిమర్శ చేసుకునే పనే లేదా? గతాన్ని శాశ్వతంగా పాతిపెట్టడం ఏ ప్రభుత్వాలకూ చేత కాదు. ప్రభుత్వాలు తాత్కాలికం! చరిత్ర శాశ్వతం!! తాము గుజ్జర్‌లమని ఛాతీలు విరుచుకుని గర్వంగా చెప్పుకునేవారు కొంచెం ఆలోచించాలి. గుజ్జర్‌ల పూర్వీకులంతా దారి దోపిడీదార్లు అన్నది గుర్తుంచుకోవాలి. ఆ సంప్రదాయం ఈ నాటికీ కొందరు గుజరాతీయులు కొనసాగిస్తున్నారు. బ్యాంకులు లూటీ చేసి లక్షల కోట్లు దోచుకుని పారిపోయిన వారంతా గుజరాతీయులే. అక్బర్ కాలం నుండి కొనసాగుతున్న వారి పూర్వీకుల వృత్తిని కొనసాగిస్తున్న వారే వారి బండారం బయట పడుతుందనే కాబోలు, మొఘలుల చరిత్ర పాఠ్యాంశాల్లోంచి తొలగిస్తున్నారు. కాల ప్రవాహంలో అన్నీ మారుతూనే ఉంటాయి. ఒకప్పటి బుద్ధదేశ్ తర్వాత కాలంలో గుర్జర్ దేశ్ అయ్యింది. ఇది ఇలాగే మోసకారుల నిలయంగా ఉండిపోవాలని ఈ దేశ ప్రజలు కోరుకోవడం లేదు. పరిస్థితులు పునరావృతమై, మళ్ళీ మానవీయ విలువలతో కూడిన ‘బుద్ధదేశ్’ ఎందుకు కాకూడదూ? అని అనుకుంటున్నారు!

డాక్టర్ దేవరాజు మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News