Friday, September 20, 2024

పెట్టుబడులే లక్ష్యంగా సిఎం రేవంత్ అమెరికా పర్యటన

- Advertisement -
- Advertisement -

రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సిఎం రేవంత్ రెడ్డి అమెరికా, దక్షిణ కొరియా పర్యటన
ఎనిమిది రోజులు అమెరికాలో, రెండు రోజులు దక్షిణ కొరియాలో…
పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు
అమెరికాలోని ప్రవాస భారతీయులతో సమావేశం కానున్న సిఎం రేవంత్
నేడు న్యూజెర్సీలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సిఎం రేవంత్ రెడ్డి అమెరికాకు బయలుదేరి వెళ్లారు. అమెరికాతో పాటు దక్షిణ కొరియాలోని సియోల్‌లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఎనిమిది రోజులు అమెరికాలో, రెండు రోజులు దక్షిణ కొరియాలో సిఎం బృందం పర్యటిస్తుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పెట్టుబడిదారులకు సిఎం రేవంత్ వివరించనున్నారు. ఆగస్టు 14వ తేదీ వరకు ఈ పర్యటన కొనసాగనుంది.

సిఎం వెంట సిఎస్, ఐటీ, పరిశ్రమల శాఖ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి సైతం వెళ్లారు. అమెరికాలో పలు నగరాల్లో సిఎం బృందం పర్యటించనుంది. ఆగష్టు 4వ తేదీన శ్రీధర్ బాబు, 5వ తేదీన కోమటిరెడ్డి అమెరికా వెళ్లనున్నారు. అక్కడే సిఎం బృందంతో కలిసి ఈ పర్యటనలో పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. సిఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పెట్టుబడుల కోసం రేవంత్‌రెడ్డి విదేశాల్లో పర్యటించడం ఇది రెండోసారి.

9వ తేదీ వరకు న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్‌లో…
ఈ నెల తొమ్మిదో తేదీ వరకు న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కో నగరాల్లో పర్యటించి పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో సిఎం రేవంత్ భేటీ అవుతారు. అమెరికాలోని ప్రవాస భారతీయులతోనూ సిఎం సమావేశమవుతారు. సిఎం రేవంత్‌రెడ్డి బృందం ఆదివారం న్యూయార్క్‌కు చేరుకుంటుంది. ఈనెల 4వ తేదీన న్యూజెర్సీలో ఓ కార్యక్రమంలో సిఎం పాల్గొంటారు. 5వ తేదీన న్యూయార్క్‌లోని కాగ్నిజెంట్ సీఈఓ సహ ఆర్సీఎం, టిబిసి, కార్నింగ్, జోయిటస్ సంస్థల ప్రతినిధులతో సిఎం భేటీ అవుతారు. అలాగే ఆర్గా సీఈఓ రామకృష్ణ, పి అండ్ ఓ సంస్థ సీఓఓ శైలేష్ జెజురికర్, ర్యాపిడ్ ఏడుగురు ప్రతినిధులతో సమావేశమవుతారు. ఈనెల 6వ తేదీన పెప్సికో, హెచ్‌సిఏ ఉన్నతాధికారులతో సమావేశమైన తరువాత న్యూయార్క్ నుంచి సిఎం వాషింగ్టన్ చేరుకుంటారు.

వాషింగ్టన్‌లో రౌండ్ టేబుల్ సమావేశంలో
వాషింగ్టన్‌లో ఐటీ సేవల సంస్థలు నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో సిఎం రేవంత్ పాల్గొంటారు. ఇక్కడ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సిఎం రేవంత్ సమావేశమవుతారు. అనంతరం డల్లాస్‌కు వెళ్తారు. ఈ నెల 7వ తేదీన ఛార్లెస్ స్క్వాబ్ హెడ్, మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా సందర్శన, ఐటీ సేవల సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశంలో సిఎం పాల్గొంటారు. 8వ తేదీన కాలిఫోర్నియాలో ట్రినెట్ సీఈఓ, ఆరమ్, ఆమ్జెన్, రెనెసాస్, అమాట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. సెలెక్ట్ టెక్ యూనికారన్స్ ప్రతినిధులతో ఇష్టాగోష్టి, సెమీ కండక్టర్ రంగానికి చెందిన పలు సంస్థలతో రౌండ్ టేబుల్ భేటీలో రేవంత్ పాల్గొంటారు. ఈ నెల 9వ తేదీన గూగుల్ సీనియర్ ప్రతినిధులతో సిఎం రేవంత్ భేటీ ఉంటుంది.

స్టాన్ఫోర్డ్ బయోడిజైన్ సెంటర్ సందర్శన, అమెజాన్ వైస్ ప్రెసిడెంట్, జెడ్ స్కేలర్ సీఈఓ, ఎనోవిక్స్, మోనార్క్ ట్రాక్టర్స్, థెర్మోఫిషర్ సైంటిఫిక్ ప్రతినిధులను సిఎం రేవంత్ కలుస్తారు. ఈ నెల 10వ తేదీన అమెరికా నుంచి బయలుదేరి 11వ తేదీన దక్షిణ కొరియా సియోల్‌కు సిఎం రేవంత్ చేరుకుంటారు. 12 తేదీన సియోల్లో యూయూ ఫార్మా, కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్స్ ఇండస్ట్రీ, ఎల్‌ఎస్ హోల్డింగ్స్, హ్యుందాయ్ మోటార్స్ ప్రతినిధులు సహా ఆ దేశ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. 13వ తేదీన హాన్ రివర్ ప్రాజెక్టుపై డిప్యూటీ మేయర్ జూ యంగ్ టాయ్తోతో సిఎం భేటీ ఉంటుంది. 14వ తేదీన సిఎం రేవంత్ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ప్రతినిధులతో సిఎం రేవంత్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. సామ్‌సంగ్, ఎల్జీ సంస్థల ప్రతినిధులతోనూ సిఎం రేవంత్‌రెడ్డి బృందం చర్చలు జరుపనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News