Friday, December 20, 2024

20 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటికే స్థలం అందుబాటులోకి వచ్చిన 20 ప్రాంతాల్లో వెంటనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్‌ల నిర్మాణం ప్రారంభించాలని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆయన విద్యాశాఖ, ఆర్ అండ్ బి, ప్రైవేటు నిర్మాణ సంస్థ ప్రతినిధులతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల లే అవుట్, నిర్మాణ డిజైన్లు, వసతులు, బడ్జెట్ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మొదటి దశలో ప్రారంభిస్తున్న 20 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం వచ్చే ఏడాది జూన్ కల్లా పూర్తి కావాలని డిప్యూటీ సిఎం ఆదేశించారు. ఈ అంశంపై ఇప్పటికే సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు నిర్మాణ సంస్థకు పలు సూచనలు చేశారు. గతంలో చేసిన సూచనలు ఏ మేరకు అమలు చేశారో ఫ్రీ కాస్ట్ నిర్మాణ సంస్థ నిర్వాహకులను విచారించారు.

ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం కోసం ఇప్పటివరకు వచ్చిన స్థలాలకు సంబంధించిన వివరాలను మంత్రి భట్టి విక్రమార్క విద్యాశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 37 ప్రాంతాల్లో 49 పాఠశాలల నిర్మాణానికి సంబంధించిన స్థలాల వివరాలు వచ్చినట్టు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం వివరించారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణంలో వేగం పెంచడానికి ప్రతివారం సమీక్ష సమావేశం నిర్వహించాలని డిప్యూటీ సిఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో పగటి పూట వెలుతురు, కబడ్డీ వంటి క్రీడలకు అనువైన స్థలం, పార్కులు వంటి వాటి నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపళ్లకు ట్రిబుల్ బెడ్ రూమ్, ఇతర సిబ్బందికి డబుల్ బెడ్ రూమ్, ఉన్నత విద్యాశాఖ అధికారులు పర్యటనకు వస్తే బస చేసేందుకు సౌకర్యంగా నిర్మాణాలు ఉండాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్పోర్ట్ పీరియడ్ తప్పకుండా నిర్వహించాలని, ఆగస్టు 15, రిపబ్లిక్ డే సందర్భాల్లో విద్యార్థులకు క్రీడా పోటీలు, ఇతర ప్రోత్సాహ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.

త్వరితగతిన కోచింగ్ సెంటర్ల నిర్మాణం ప్రారంభించాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అంబేద్కర్ నాలెడ్జ్ కోచింగ్ సెంటర్స్ నిర్మాణం పనులు త్వరితగతిన ప్రారంభించాలని డిప్యూటీ సిఎం అధికారులను ఆదేశించారు. ఈ భవనాలకు అవసరమైన స్థలం, నిర్మాణ వ్యయంపైన మంత్రి సమీక్షించారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో నిర్మిస్తున్న నాలెడ్జ్ సెంటర్లను స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల లేదా పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్మించాలని, ఫలితంగా స్థానిక కళాశాల విద్యార్థులు సైతం వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, డిప్యూటీ సిఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి, మహాత్మ జ్యోతిబాపూలే సెక్రెటరీ సైదులు, ఎస్‌సి, ఎస్‌టి రెసిడెన్షియల్ వెల్ఫేర్ సెక్రటరీ సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News