చండీగఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన ఆరుగురు అభ్యర్థులపై ఎన్నికల సంఘం వేటేసింది. ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించింది. ఈ విషయాన్ని పంజాబ్ ఎన్నికల ప్రధానాధికారి సిబిన్ సి సోమవారం తెలిపారు. ఈ ఆరుగురు 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగారు. నిర్ధేశిత సమయంలో వీరు ఎన్నికల సంఘానికి ఈ అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచార వ్యయాన్ని సమర్పించకపోవడం చర్యకు దారితీసింది.
వీరు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 78 పరిధిలో వ్యయ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇకపై వచ్చే మూడేండ్ల పాటు ఎన్నికలలో పోటీ చేయడానికి వీల్లేకుండా నిషేధించారు. దీనికి చట్టంలోని సెక్షన్ 10 ఎ నిబంధనను వాడారు. ఈ ఆరుగురు కూడా గురుదాస్‌పూర్ జిల్లాలోనే పోటీకి దిగారు. కాగా బటాలా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన సుచా సింగ్‌పై గత నెల 15వ తేదీన ఎన్నికల సంఘం అనర్హత వేటేసింది. అదే విధంగా క్వాదియన్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన ప్రేమ్‌సింగ్, హర్దీప్ సింగ్‌లపై కూడా ఈ విధమైన అతిక్రమణలతోనే అనర్హత వేటేశారు.