Monday, December 23, 2024

ప్రజా గాయకుడు గద్దర్

- Advertisement -
- Advertisement -

తూప్రాన్ తాలుకాలో హెచ్‌ఎస్‌సి పాసైన తొలి దళిత విద్యార్థిగా విఠల్ పేరు పొందారు. తర్వాత సైఫాబాద్‌లోని ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీలో పియుసి (ఎంపిసి)లో 77% మార్కులతో డిస్టింక్షన్ ని సాధించారు. 1968 లో ఉస్మానియా ఇంజినీరింగ్ కాలేజ్‌లో సీటు సాధించి సరికొత్త చరిత్రని సృష్టించారు. అయితే ఆర్థికపరమైన సమస్యల కారణంగా ఆయన ఆ ఇంజినీరింగ్ కోర్స్‌ని మధ్యలోనే వదిలేసి ప్రభుత్వ క్షేత్ర ప్రచార శాఖలో కుటుంబ నియంత్రణ బుర్రకథలు చెప్పారు. అలా ప్రభుత్వం రూ. 75 ఇస్తే బుర్రకథ దళ సభ్యులందరూ సమానంగా పంచుకునేవారు. వందలాది సార్లు చెప్పిన అంబేడ్కర్ బుర్రకథ, అల్లూరి సీతారామరాజు బుర్రకథలు ఆయన భావాలకు దారి చూపాయి.

ప్రజా గాయకుడు గద్దర్ గోచి, గొంగళి ధరించి, కాళ్లకు గజ్జెలు కట్టి, రగల్ జెండా చేతపట్టి ‘జననాట్య మండలి’ అనే విప్లవ సాంస్కృతిక సంస్థ ద్వారా భూస్వామ్య, దోపిడీ, పెట్టుబడి, సామ్రాజ్యవాద వ్యవస్థలకు వ్యతిరేకంగా పీడిత ప్రజలను విప్లవోన్ముఖులను గావించి తన జీవితం చివరి దశలో ప్రజాస్వామ్యబాటలో పయనించి గత సంవత్సరం ఆగస్టు 6 నాడు అమరుడు కావడం విషాదకరం. ఆయన మరణం ప్రతిఒక్కరినీ తీవ్రంగా కలచివేయడమే కాకుండా ముఖ్యం గా సాహిత్య, సాంస్కృతిక రంగాలకు, పీడిత ప్రజానీకానికి తీరని లోటుని కలిగించింది. గద్దర్ అనే మారుపేరుతో ప్రాచుర్యం పొందిన ‘గుమ్మడి విఠల్ రావు’ అనే ఒక సామాన్యమైన మానవుడు మెదక్ జిల్లా తూప్రాన్ గ్రామంలోని అంటరాని దళిత కుటుంబంలో గుమ్మడి లచ్చుమమ్మ, గుమ్మడి శేషయ్య అనే దంపతులకు 1948, జనవరి 31 నాడు జన్మించారు.

విఠల్ ఆరోయేట వచ్చే వరకు మట్టివాసనలు గుబాలించే పల్లె పదాలు, జానపద పాటలు బాగా పాడే తల్లి లచ్చుమమ్మని చూసి జానపద బాణీలను బాగా అనుకరించారు. తూప్రాన్ తాలుకాలో హెచ్‌ఎస్‌సి పాసైన తొలి దళిత విద్యార్థిగా విఠల్ పేరు పొందారు. తర్వాత సైఫాబాద్‌లోని ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీలో పియుసి (ఎంపిసి)లో 77% మార్కులతో డిస్టింక్షన్ ని సాధించారు. 1968 లో ఉస్మానియా ఇంజినీరింగ్ కాలేజ్‌లో సీటు సాధించి సరికొత్త చరిత్రని సృష్టించారు. అయితే ఆర్థికపరమైన సమస్యల కారణంగా ఆయన ఆ ఇంజినీరింగ్ కోర్స్‌ని మధ్యలోనే వదిలేసి ప్రభుత్వ క్షేత్ర ప్రచార శాఖలో కుటుంబ నియంత్రణ బుర్రకథలు చెప్పారు. అలా ప్రభుత్వం రూ. 75 ఇస్తే బుర్రకథ దళ సభ్యులందరూ సమానంగా పంచుకునేవారు. వందలాది సార్లు చెప్పిన అంబేడ్కర్ బుర్రకథ, అల్లూరి సీతారామరాజు బుర్రకథలు ఆయన భావాలకు దారి చూపాయి.

ఈ క్రమంలోనే విఠల్‌కి ‘ఆర్ట్ లవర్స్’ అనే ప్రగతిశీల సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపకులు బి.నరసింగరావు కళా సాన్నిహిత్యం లభించడంతో ఆయన 1970లో ఆ ఆర్ట్ లవర్స్ సంస్థలో చేరారు. ఆ ఆర్ట్ లవర్స్‌లో ఒక సందర్భంలో వచ్చిన కళ ఎవరి కోసం? అనే చర్చఫలితంగా ‘కళ ప్రజల కోసం’ అనే అంతిమ సమాధానం విఠల్‌ని ఎంతగానో ప్రభావితం చేసింది. ‘ప్రజలను జాగృతంచేసే కళకు అంకితమవ్వాలి’ అని నిర్దేశించుకున్న విఠల్ తన పాటల బాణీలను ప్రజల కోసం రూపొందించాడు. క్రమంగా గుమ్మడి విఠల్ ‘గద్దర్’గా పరిణామం చెందారు. నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాలు నిర్వహిస్తున్న సమసమాజ పోరాటాలు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అభ్యుదయ ఉద్యమాలు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ చైతన్యం, చైనాలో జరుగుతున్న సాంస్కృతిక విప్లవం చైతన్యం, జాతీయంగాను, అంతర్జాతీయంగాను సోషలిస్ట్ శిబిరాలు ఏర్పడడం మొదలైన సంఘటనలు అన్ని గద్దర్‌ని విప్లవోద్యమం వైపు పయనింపజేయడానికి దోహదపడ్డాయి.

నక్సల్బరీ, శ్రీకాకుళం పోరాటాలు, లవర్స్ సంస్థని క్రమంగా ‘జననాట్య మండలి’గా రూపొందించాయి. అలా జననాట్యమండలి వెలుగులో గద్దర్ అంబేడ్కరిజం నుండి క్రమంగా ‘మార్క్సిజం- లెనినిజం- మావో ఆలోచనా విధానం’ దిశగా పరివర్తన చెందారు. అలా గద్దర్ 1973 నుండి పాటలు రాస్తూ జననాట్యమండలికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గద్దర్ 1975 లో సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడుపల్లిలో గల కెనరా బ్యాంక్‌లో ఉద్యోగంలో చేరి 1992లో అప్పటి పీపుల్స్‌వార్ పార్టీ నిర్ణయం మేరకు ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తికాలపు జననాట్యమండలి సభ్యుడిగా కొనసాగారు. 1985 -89 వరకు పూర్తిగా ఆట- పాట- మాట బంద్ కావడంతో జననాట్య మండలి బహిరంగంగా పనిచేయని విషమపరిస్థితులు తలెత్తడంతో గద్దర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

1990, ఫిబ్రవరి 18 వ తేదీన హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంతో గద్దర్ తిరిగి బహిరంగ జీవితంలోకి ప్రవేశించారు. కాలక్రమంలో ఆయన ప్రజాస్వామ్య బాటలో అడుగులు వేసి ఓటు హక్కుని నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉండగానే ఆయన ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరి అక్కడే తనువు చాలించడం కోట్లాది ప్రజానీకాన్ని తీవ్రంగా కలచివేసింది. నేడు గద్దర్ భౌతికంగా లేకున్ననూ ఆయన తన పాటల ద్వారా ప్రతినిత్యం పల్లవిస్తూనే ఉంటారు. ‘బతుకే ఒక పోరాటం’ అని నినదించి సమసమాజ స్థాపన కోసం అనునిత్యం ఉద్యమించిన గద్దర్ అశేష జనం గుండె చప్పుళ్లలో ప్రతిధ్వనిస్తూ ’సమసమాజ స్వాప్నిక వేగుచుక్క’గా తరతరాలు ప్రభవిస్తూనే ఉంటారు.

జె.జె.సి.పి. బాబూరావు
9493319690

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News