Sunday, December 22, 2024

దేశానికి ఎరువులు.. విదేశాల అరువే!

- Advertisement -
- Advertisement -

స్వాతంత్య్రం వచ్చి 77 సంవత్సరాలైనా వ్యవసాయ రంగంలో అభివృద్ధి నత్తనడకన సాగుతున్నది. పంటల దిగుబడులకు కీలకమైన ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధ్ది సాధించలేకపోయాం. ఫలితంగా ఎరువుల కొరతను తీర్చటానికి దిగుమతులపై ఆధార పడుతున్నాము. స్వయం సమృద్ధి సాధిస్తామని పాలకులు చెప్పేమాట, మాటలకే పరిమితమవుతున్నది. సుదీర్ఘ కాలంగా కొత్తగా ఎరువుల కర్మాగారం ఒక్కటి కూడా పాలక ప్రభుత్వాలు నిర్మించలేదంటే ఎరువుల రంగంలో పాలకుల వైఫల్యానికి అద్దం పడుతున్నది. 1956 నాటి పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకారం ప్రభుత్వ యాజమాన్యం క్రిందికి వచ్చిన నూతన సంస్థల స్థాపనలో ప్రభుత్వమే చొరవ తీసుకునే పరిశ్రమల్లో ఎరువుల పరిశ్రమ కూడా ఒకటి అనేక ఇతర పరిశ్రమల్లో లాగానే ఈ పరిశ్రమ కూడా కాలక్రమేనా దాదాపు పూర్తిగా విదేశీ సంస్థలపై ఆధారపడే విధంగా తయారైంది.

ట్రాంబే వద్ద ప్రభుత్వ రంగంలో నెలకొల్పదలసిన ఎరువుల కర్మాగారానికి రుణ సహాయం కోసం అమెరికన్ గుత్త పెట్టుబడిదారులతో ఒప్పందం చేసుకున్నప్పటి నుండి (1956-59) వారికిచ్చిన రహస్య వాగ్దానానికి అనుగుణంగా ప్రైవేట్ రంగం ఎరువుల పరిశ్రమలో విదేశీ పెట్టుబడి చొరబడేందుకు భారత ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని తన తాకట్టులో భారతదేశం అనే మహత్తర గ్రంథంలో భారత కమ్యూనిస్టు విప్లవకారుల నాయకుడు తరిమెల నాగిరెడ్డి వివరించారు. దేశంలో ఎరువుల ఉత్పత్తి కోసం ఆర్థిక సహాయం, సాంకేతిక పరిజ్ఞానం కోసం విదేశీ గుత్త సంస్థలపై ఆధారపడటం వలన దేశంలో అపారంగా లభించే ముడి పదార్ధమైన బొగ్గును వినియోగించే కొత్త ఎరువుల కర్మాగారాలు పెట్టే క్రమం ఆగిపోయింది. విదేశీ కంపెనీల ప్రాబల్యం కింద ఉన్న రిఫైనరీల నుండి లభ్యమయ్యే నాప్తా లేదా దిగుమతి చేసుకోవలసిన ద్రవ్యరూపంలోనున్న అమోనియాను ముడి పదార్థాలుగా ఉపయోగించే కర్మాగారాలపైనే ఆధారపడి వాటిని దిగుమతి చేసుకొని ఎరువుల ఉత్పత్తి చేయాల్సి వచ్చింది.

ప్రస్తుతం దేశంలో ఎరువుల ఉత్పత్తి 42.45 మిలియన్ టన్నులుగా ఉంది. ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కో ఆపరేటివ్ లిమిటెడ్ (ఐఎఫ్‌ఎఫ్‌సిఒ) కృషక్ భారత్‌కో ఆపరేటివ్ లిమిటెడ్, నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, రాష్ట్రీయ కెమికల్స్ & ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, జువారి ఆగ్రో కెమికల్స్ లిమిటెడ్, చంబల్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్, నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్, దీపక్ ఫెర్టిలైజర్స్ అండ్ పెట్రో కెమికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్, మంగళూరు కెమికల్స్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, ఇండో గల్ఫ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, పరదీప్ పాస్పేట్స్ లిమిటెడ్, సదరన్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్‌లు ఎరువుల ఉత్పత్తి పరిశ్రమలుగా ఉన్నాయి.

ఈ ఫ్యాక్టరీలు ఎరువులు ఉత్పత్తి చేయటానికి కావాల్సిన ముడి పదార్థాలను, టెక్నాలజీని నేటికీ విదేశీ కంపెనీల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ఫలితంగా మన ఎరువుల కర్మాగారాలు విదేశీ కంపెనీల ముడి పదార్థాలపై నేటికీ ఆధాపడిఉన్నాయి. ముడి పదార్ధాల దిగుమతి కోసం పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం చెల్లిస్తున్నాము. దేశంలో ఎరువుల ఉత్పత్తి 42.45 మిలియన్ టన్నులుగా ఉంటే 2020లో వినియోగం 62 మిలియన్ టన్నులుగా ఉంది. వినియోగంలో 55% యూరియాగా ఉంది. ఒక అధ్యయనం ప్రకారం 1960లో భారతదేశం ఎరువుల వినియోగం పది లక్షల టన్నుల కంటే తక్కువ. 2000 సంవత్సరం ప్రారంభంలో కోటి 70 లక్షల టన్నులకు. 2019కి సంబంధించిన డేటా ప్రకారం 5 కోట్ల టన్నులకు. 2023 నాటికి 7 కోట్ల పది లక్షల టన్నులకు ఎరువుల వాడకం చేరింది. దేశంలో హరిత విప్లవం అమల్లోకి వచ్చిన తర్వాతే ఎరువుల వినియోగం పెరుగుదల ప్రారంభమైంది. రసాయనిక ఎరువుల వినియోగం వలన భూమి సారం కోల్పోయి గుల్లబారుతూ ఆ ఎరువులు వాడందే పంటదిగుబడి రాని పరిస్థితుల్లో ఎరువుల వాడకం తీవ్ర స్థాయికి చేరుకుంది.

ఎరువుల దిగుమతి దేశాల్లో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. మోడీ ప్రభుత్వ పాలనలో దిగుమతులు తీవ్రరూపం దాల్చాయి. 2021లో 6,523.53 మిలియన్ల అమెరికా డాలర్ల విలువైన యూరియా, 4,169.95 మిలియన్ల యు ఎస్ డాలర్ల విలువైన ఫాస్పేట్ ఎరువులు, 1036.79 మిలియన్ల యుఎస్ డాలర్ల విలువైన పొటాషియం ఆధారిత ఎరువులు దిగుమతి చేసుకున్నది. 2021 -22లో దిగుమతి చేసుకున్న అన్ని రకాల ఎరువుల మొత్తం విలువ 12,765.66 మిలియన్ల అమెరికా (1,27,651 డాలర్లు) డాలర్లుగా ఉంది. ఇదే సమయంలో ఇండియా 2.5 కోట్ల టన్నుల యూరియా, 42 లక్షల టన్నుల డిఎపి, 83 లక్షల టన్నుల కాప్లెక్స్ ఎరువులు, 33 లక్షల టన్నుల సింగిల్ సూపర్ పాస్పేట్ ఉత్పత్తి చేసినట్లు లెక్కలు తెలుపుతున్నాయి.

ఈ ఎరువుల ఉత్పత్తికి కావాల్సిన మొత్తం ముడి పదార్థాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాము. దీన్ని గమనిస్తే దిగుమతి చేసుకున్న ముడి సరుకును దేశీయ ఫ్యాక్టరీల్లో ఎరువులుగా తయారు చేశారే తప్ప సొంతంగా ఉత్పత్తి చేయలేదని వెల్లడవుతున్నది. యూరియా ఉత్పత్తిలో 2000 నాటికి సాధించిన స్వయం సమృద్ధి, ఆ తర్వాత ఉత్పత్తి తిరోగమనంలో పయనించింది. దేశంలో అమలు జరిపిన సరళీకరణ విధానాల వలన ప్రభుత్వ రంగంలో పెట్టుబడుల అవసరం లేదని పాలకుల నిర్ణయంగా ఉంది. పలితంగా 1995 నుంచి పెట్టుబడులు నామ మాత్రమయ్యాయి. వాజ్‌పాయ్ పాలనలో 2002లో బొగ్గు, నాఫ్త్తా, ఇంధన చమురు వాయువు, లిగ్నైట్ తో పని చేసే అనేక ప్లాంట్లు మూసివేయబడ్డాయి.మోడీ ప్రభుత్వ కూడా ప్రభుత్వరంగ యూనిట్లను విస్తరించకపోవటం, కొన్ని ఆపరేటింగ్ యూనిట్లను మూసివేయడం కారణంగా ఎరువుల ఉత్పత్తి ప్రైవేట్‌రంగంలోకి వెళ్లింది. ఫలితంగా యూరియాతో పాటు ఇతర ఎరువులను దిగుమతి చేసుకోవటం అనివార్యమైంది.

పెర్టిలైజర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్‌ఎఐ) నుంచి వచ్చిన డేటా ప్రకారం గత 30 సంవత్సరాల్లో ఎరువుల పదార్థాల వినియోగం 3.3 శాతం వార్షిక వృద్ధి రేటుగా ఉంటే, ఉత్పత్తి మాత్రం 2.18 శాతం మాత్రమే పెరిగింది. ఫలితంగా భారీగా దిగుమతులు అవసరమయ్యాయి. ప్రధానంగా ఎరువుల దిగుమతులు రష్యా, చైనా, ఉక్రెయిన్, ఇండోనీషియా, సౌదీఅరేబియా తదితర దేశాల నుంచి జరిగింది. దేశంలో వ్యవసాయంపై హక్మ్ దేవ్ నారాయణ్ యాదవ్ అధ్యక్షుడుగా ఉన్న స్టాండింగ్ కమిటీ వ్యవసాయం, అనుబంధ రంగాలపై రసాయనిక ఎరువుల, పురుగు మందుల ప్రభావంపై 11- ఆగస్టు 2016న మోడీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దేశంలో వ్యవసాయ ఉత్పత్తితో పాటు ఎరువుల వినియోగం కూడా పెరుగుతున్నదని నివేదిక పేర్కొన్నది.

1960లో వ్యవసాయ ఉత్పత్తి 83 మిలియన్ల టన్నులుగా ఉంటే 2014 నాటికి 252 మిలియన్ల టన్నులకు పెరిగిందని, అదే కాలంలో రసాయనిక ఎరువుల వాడకం ఒక మిలియన్ టన్నుల నుంచి 25.6 మిలియన్ల టన్నులకు పెరిగిందని కమిటీ నివేదిక పేర్కొంది. మన దేశానికి ఎరువులు దిగుమతి చేసే దేశాలు లాబీగా ఏర్పడి రేట్లను, డిమాండ్‌ను కంట్రోల్ చేస్తున్నాయి. కోవిడ్ తర్వాత పెరిగిన డిమాండ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 2021 నుండి గ్యాస్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. దాని ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో 2020-21 వార్షిక సంవత్సరంలో డిఎపి టన్ను ధర 383 అమెరికా డాలర్ల నుంచి 560 డాలర్లకు, పొటాష్ 230 నుంచి 280 డాలర్లకు, అమ్మోనియా 210 నుంచి 450 డాలర్లకు, పాస్ఫారిక్ ఆమ్లం 590 నుంచి 998 డాలర్లకు, సల్ఫర్ 85 నుంచి 220 డాలర్లకు ధరలు పెరిగాయి. 2022 నాటికి అమ్మోనియా టన్నుకు 330 నుంచి 990 అమెరికన్ డాలర్లకు పెరిగింది. భారత దేశానికి దిగుమతి అయ్యే ప్రధాన ఎరువుల పదార్ధమైన యూరియా, డిఎపి విషయంలో కూడా ఇదే విధంగా ధరలు పెరిగాయి.

భారతదేశంలో ఎరువుల ధరల నిర్ణయం నుండి మోడీ ప్రభుత్వం వైదొలిగి, ధరల నిర్ణయం ఎరువుల కంపెనీలకే అప్పగించడం అంటే, వాటి దోపిడీకి అనుమతి ఇవ్వటమే. ధరల నిర్ణయం కంపెనీ చేతుల్లోకి వెళ్లిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌తో సంబంధం లేకుండా దాదాపు దేశంలో 13 సార్లు ఎరువుల ధరలు పెరిగాయి. మోడీ ప్రభుత్వ పాలనలోనే ఎరువుల ధరల పెరుగుదల పరంపరప్రారంభమైంది. పాలకుల విధానాల ఫలితంగా ఎరువుల ధరలు పెరిగటంతో సేద్యపు ఖర్చులు పెరిగి రైతాంగం సంక్షోభంలోకి నెట్టబడ్డారు. భారత పాలకులు కంపెనీలకే ఎరువుల ధరల నిర్ణయాన్ని కట్టబెట్టటం, ఎరువుల ఉత్పత్తి ప్రైవేట్ రంగం ఆధిపత్యంలోకి వెళ్లడం, విదేశాల నుంచి దిగుమతులు పెరగడం, కొత్తగా ఎరువుల ఫ్యాక్టరీలు స్థాపించకపోవటం రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభానికి కారణంగా ఉంది. ఈ పరిస్థితులు మారాలంటే దిగుమతులపై ఆధారపడకుండా ఎరువుల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించాలి. అందుకోసం ప్రభుత్వరంగలో పరిశ్రమల విస్తరణ జరగాలి. దేశంలో లభ్యమయ్యే అన్ని రకాల ముడి పదార్థాలతో ఉత్పత్తి కొనసాగించాలి.

బొల్లిముంత సాంబశివరావు
9885983526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News