Monday, December 23, 2024

ఆర్థిక బిల్లుకు లోక్‌సభ ఆమోదం

- Advertisement -
- Advertisement -

రియల్ ఎస్టేట్‌పై ఇటీవలే ప్రవేశపెట్టిన నూతన మూలధన లాభాల పన్నును ప్రభుత్వం సడలించిన తరువాత ఆర్థిక బిల్లు 2024ను లోక్‌సభ బుధవారం ఆమోదించింది. ఈ సడలింపు వల్ల పన్ను చెల్లింపుదారులు కొత్త తక్కువ పన్ను రేటుకు మారడానికి లేదా ఇండెక్సేషన్ ప్రయోజనంతో అధిక రేటు గల పాత పన్ను విధానంతో కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఇండెక్సేషన్ ప్రయోజనం లేకుండానే రియల్ ఎస్టేట్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టిసిజి)ని 20 శాతం నుంచి 12 శాతానికి తగ్గించేందుకు తన 2024-25 బడ్జెట్‌లో ప్రతిపాదించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆప్షన్ ఇచ్చేందుకు బిల్లుకు సవరణ ప్రవేశపెట్టారు. ద్రవ్యోల్బణానికి సర్దుబాటు చేసుకున్న తరువాత ఆస్తి ధరకు రావడానికి పన్ను చెల్లింపుదారులకు ఇండెక్సేషన్ ప్రయోజనం వీలు కల్పిస్తుంది. పన్ను విధింపును పెంచినందుకు, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులకు ప్రోత్సాహకాలు లేనందుకు కొత్త నిబంధన విమర్శలకు గురైన తరువాత ఈ సవరణ చోటు చేసుకుంది.

బిల్లులో తీసుకువచ్చిన ప్రధాన సవరణ జూలై 23కు ముందు కొన్న ఆస్తుల విక్రయంపై ఇండెక్సేషన్ ప్రయోజనం పునరుద్ధరణకు సంబంధించినది. ఇప్పుడు జూలై 23కు ముందు ఇళ్లు కొనుగోలు చేసిన వ్యక్తులు లేదాహెచ్‌యుఎఫ్‌లు ఇండెక్సేషన్ లేకుండా 12.5 శాతం రేటుకు కొత్త పన్ను కింద ఎల్‌టిసిజి పన్ను చెల్లింపును ఎంచుకోవచ్చు లేదా ఇండెక్సేషన్ ప్రయోజనం పొందుతూ 20 శాతం పన్ను చెల్లించవచ్చు. దిగువ సభ మూజువాణి వోటుతో 45 అధికారిక సవరణలతో బిల్లును ఆమోదించింది. 2024 ఆర్థిక బిల్లు ఇప్పుడు చర్చ కోసం రాజ్యసభకు వెళుతుంది. అయితే, రాజ్యాంగం ప్రకారం మనీ బిల్లును తిరస్కరించే అధికారం ఎగువ సభకు ఉండదు. అది అటువంటి బిల్లులను తిప్పిపంపడం మాత్రమే చేయగలదు. ఒకవేళ రాజ్యసభ నిర్దేశిత 14 రోజులలోగా అలా చేయనట్లయితే, బిల్లుకు ఆమోదముద్ర లభించినట్లుగా పరిగణిస్తారు. 2025 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనల లక్షం పెట్టుబడులను ప్రోత్సహించడం, మధ్య తరగతికి లబ్ధి చేకూర్చడం అని కూడా సీతారామన్ చెప్పారు.

లిస్ట్ అయిన ఈక్విటీలు, బాండ్లలో దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను మినహాయింపు పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 1.25 లక్షలకు పెంచడం స్టాక్ మార్కెట్లలో మదుపు చేసే మధ్య తరగతికి లబ్ధి చేకూరుస్తుందని ఆమె తెలిపారు. మోడీ ప్రభుత్వం పన్నులను మరీ ఎక్కువగా పెంచకుండా సరళీకృత పన్ను వ్యవస్థను తీసుకువచ్చిందని, పన్ను పాటింపును తేలిక చేసిందని ఆమె చెప్పారు. వివిధ సరకులపై కస్టమ్స్ సుంకం తగ్గింపు వాణిజ్యాన్ని, పెట్టుబడులను ప్రోత్సహిస్తుందని, ఉపాధి కల్పనకు దోహదం చేస్తుందని సీతారామన్ తెలిపారు. ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై జిఎస్‌టిని తొలగించాలన్న డిమాండ్లకు సీతారామన్ స్పందిస్తూ, వసూలైన జిఎస్‌టిలో 75 శాతం రాష్ట్రాలకు వెళుతుందని తెలియజేశారు. ఆరోగ్య బీమా (ప్రీమియం)పై 18 శాతం జిఎస్‌టి విధింపునకు ముందు అన్ని రాష్ట్రాలు బీమా ప్రీమియంలపై పన్ను విధిస్తుండేవని, జిఎస్‌టిని ప్రవేశపెట్టిన తరువాత ఆ పన్ను ఆటోమేటిక్‌గా జిఎస్‌టిలో కలిసిపోయిందని సీతారామన్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News