మోడీకి, ఆయన ప్రభుత్వానికి, వారి పార్టీ అయిన బిజెపికి, మాతృ సంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌కు హిందూ మతతత్వ ముద్ర ఉండడం తెలిసిందే. అందుకు భిన్నంగా చంద్రబాబు, నితీశ్‌ల పట్ల సెక్యులర్ వాదులనే పేరున్నది. అదెంత నిఖార్సయిన మాటన్నది తర్వాత చూద్దాము. కాని ఆ పేరైతే ఉన్నది. కనుక వారు మోడీపై సెక్యులర్ వత్తిడి చేయాలన్నది దేశంలో పలువురి ఆశాభావం. ఎందుకంటే, ఆ రెండు రాష్ట్రాలకు అవసరమయ్యే నిధులు, ప్రాజెక్టులు అభివృద్ధికి సంబంధించినవి. అక్కడికి పరిమితమైన విషయాలు. అందుకు భిన్నంగా సెక్యులరిజమన్నది మొత్తం దేశానికి సంబంధించినది. ఎందుకో వివరించనక్కర లేదు. అటువంటప్పుడు చంద్రబాబు, నితీశ్‌లు తమకు తమ రాష్ట్రాల పట్లనే గాక మొత్తం దేశం పట్ల కూడా బాధ్యత ఉందని భావించిన పక్షంలో, మోడీ ప్రభుత్వం పై సెక్యులర్ వత్తిడి తేవలసి ఉంటుంది.
ఎన్‌డిఎలో భాగస్వాములుగా ఉన్న టిడిపి ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడు, జనతాదళ్ (యునైటెడ్) ప్రభుత్వ నాయకుడు నితీశ్ కుమార్, తమ ఏలుబడిలోని ఆంధ్రప్రదేశ్, బీహార్‌లకు అవసరమైన వాటిని, ప్రధాని మోడీ ప్రభుత్వం నుంచి సాధించుకోవడం మంచిదే. తమ మద్దతు లేనిదే ఎన్‌డిఎ ప్రభుత్వం కొనసాగే అవకాశం దాదాపు లేనందున, మద్దతుకు బదులుగా కొన్ని అడిగి తీసుకోవడం సాధారణంగా జరిగేదే. ఆ ప్రకారం 202425 బడ్జెలో ఇరువురికి అదనపు నిధులు, కొన్ని ప్రాజెక్టులు లభించాయి.ఆ క్రమంలో మోడీ ప్రభుత్వం ఇతర దక్షిణాది రాష్ట్రాలను, ఎన్‌డిఎలో లేని రాష్ట్రాలను చిన్నచూపు చూసిందనే విమర్శలు వచ్చాయి. ఈ విషయమై ఇప్పటికే చాలా చర్చలు జరిగినందున దానిని పక్కన ఉంచుదాము. అయితే, ఈ రెండు పార్టీలు మోడీ ప్రభుత్వం, బిజెపి పార్టీ సెక్యులర్‌గా వ్యవహరించడం అవసరమనే ఒత్తిడి కూడా చేయగలరా, చేస్తున్నాయా అన్నది ఒక ముఖ్యమైన ప్రశ్నగా మారుతున్నది.
మోడీకి, ఆయన ప్రభుత్వానికి, వారి పార్టీ అయిన బిజెపికి, మాతృ సంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌కు హిందూ మతతత్వ ముద్ర ఉండడం తెలిసిందే. అందుకు భిన్నంగా చంద్రబాబు, నితీశ్‌ల పట్ల సెక్యులర్ వాదులనే పేరున్నది. అదెంత నిఖార్సయిన మాటన్నది తర్వాత చూద్దాము. కాని ఆ పేరైతే ఉన్నది. కనుక వారు మోడీపై సెక్యులర్ ఒత్తిడి చేయాలన్నది దేశంలో పలువురి ఆశాభావం. ఎందుకంటే, ఆ రెండు రాష్ట్రాలకు అవసరమయ్యే నిధులు, ప్రాజెక్టులు అభివృద్ధికి సంబంధించినవి. అక్కడికి పరిమితమైన విషయాలు. అందుకు భిన్నంగా సెక్యులరిజమన్నది మొత్తం దేశానికి సంబంధించినది. ఎందుకో వివరించనక్కర లేదు. అటువంటప్పుడు చంద్రబాబు, నితీశ్‌లు తమకు తమ రాష్ట్రాలపట్లనే గాక మొత్తం దేశం పట్ల కూడా బాధ్యత ఉందని భావించిన పక్షంలో, మోడీ ప్రభుత్వంపై సెక్యులర్ ఒత్తిడి తేవలసి ఉంటుంది.
ఈ విషయం ఇప్పుడు ప్రత్యేకంగా చర్చించడానికి కారణాలున్నాయి. మోడీ గత జూన్ ఆరంభంలో మూడవసారి అధికారానికి అయితే వచ్చారు గాని, మెజారిటీల పరిస్థితి ఏమిటో తెలిసిందే. సూటిగా మాట్లాడాలంటే, పరిపాలనా వైఫల్యాలతో పాటు మతతత్వ ధోరణులు కారణమయ్యాయన్నది అందరికీ అర్థమైన విషయం. అటువంటి స్థితిలో చేయవలసిందేమిటి? ఈ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని పద్ధతులు మార్చుకోవాలి. ఆ విధంగా చేసినట్లయితే ప్రజలు తప్పక తిరిగి ఆదరిస్తారు. ఎక్కడైనా ప్రజలకు ఆ గుణం ఉంటుంది. కాని జూన్ నుంచి జరుగుతున్నదేమిటి? పరిపాలనను మదింపు చేయడానికి ఈ రెండు నెలలు చాలవు. మతతత్వ ధోరణులు మాత్రం ఎంత మాత్రం మారలేదు. ప్రతి రెండు రోజులకు ఒకసారి కేంద్ర స్థాయి నుంచో, దేశంలో ఏదో ఒక చోటి నుంచో ఈ పోకడలు గల వార్తలు వస్తూనే ఉన్నాయి.
అవి అల్పసంఖ్యాక వర్గాలకు వ్యతిరేకమైన చర్య లు ఒక్కటే కాదు. దళితులు, ఇతర బడుగు బలహీన వర్గాలకు సంబంధించినవి కూడా. సాక్షాత్తూ బిజెపి ప్రభుత్వాల వైపు నుంచి జరిగేవి కొన్నయితే, ఆ పార్టీతో పాటు వివిధ సంఘ్ పరివార్ సంస్థల అనుయాయుల నుంచి జరిగేవి కొన్ని. వీరందరి అండ చూసుకుని పెత్తందారీ వర్గాల నుంచి చోటు చేసుకునేవి మరి కొన్ని. అధికారంలో ఉన్నందున పోలీసులు, ఇతర అధికార యంత్రాంగాల విధేయత కూడా వారికే. ఈ తరహా ఘటనల జాబితా అంతా మన దగ్గర లేదు గాని, అన్ని పత్రికలు చూడలేము గనుక అది సాధ్యం కూడా కాదు గాని, దృష్టికి వస్తున్నవైనా తక్కువ కాదు. అనగా, పాఠాలు నేర్వడం గాని పద్ధతులు మార్చుకోవడం గాని ఏమీ లేదన్న మాట.
ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ విమర్శల తర్వాతనైనా మోడీ, బిజెపిల తీరు మారగలదని కొందరు ఆశించారు. గత ఎన్నికల ఫలితాలు వెలువడిన వారం రోజులకు ఆయన జూన్ 10వ తేదీన నాగపూర్‌లో బహిరంగ విమర్శలు చేయడం తెలిసిందే. ఆ వివరాలన్నీ ఇక్కడ చెప్పుకోకున్నా క్లుప్తంగా మాట్లాడుకోవాలంటే, అందు లో ప్రధానంగా మూడు అంశాలున్నాయి. ఒకటి, మనది వైవిధ్య సమాజం. అయినా అది భిన్నత్వంలో ఏకత్వం. దాన్ని ఆమోదించాలి. ఇతరుల మార్గాలను గౌరవించాలి. అదే ధర్మం. ఆ మాట కూర్మ పురాణంలోనూ ఉంది. కాని మనం దాన్ని విస్మరించాము. దేశంలో వేర్వేరు మతాలవారున్నారు. చరిత్ర క్రమంలో బయటి నుంచి కొందరు వచ్చారు.
అదంతా ఎన్నడో జరిగింది. ఇప్పుడు అన్ని మతాలు సమానం. అన్నింటిని గౌరవించాలి. గతాన్ని వదలివేయాలి. అందరి పట్ల సద్భావన చూపాలి. విభేదాలు పూర్తిగా తొలగిపోవాలి. భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఈ దేశ సంతానమంతా మన సోదరులే. వారితో కలసిమెలసి ఉండాలి. రెండవది, కుల వ్యవస్థ ఎప్పుడో ఎందుకో వచ్చింది. కాని అది తప్పు. మూడవది, వస్తుపరమైన అభివృద్ధి ఉండవచ్చు. కాని విలువలు పోతున్నాయి. సంస్కృతి పోతున్నది. ప్రభుత్వాలు అది కూడా పట్టించుకోవాలి. నీతితోకూడిన సంపదలు అభివృద్ధి చెందాలి.
ఈ మూడు మాటలు కూడా మోడీ ప్రభుత్వానికి, బిజెపికి ఎంత సూటిగా వర్తిస్తాయో వివరించి చెప్పనక్కర లేదు. భాగవత్ ప్రసంగం పట్ల బిజెపిలో ఏమైనా చర్చలు జరిగాయో లేదో తెలియదు గాని ఆ మేరకు వార్తలేవీ కన్పించలేదు. సర్ సంఘ్ చాలక్ బహిరంగంగా ఇంత మాట్లాడిన తర్వాత, బిజెపి అన్నది సంఘ్ పరివార్‌లో భాగం అయినందున ఆ పరివార్‌కు మాతృ సంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్ చొరవ తీసుకుని బిజెపి అధ్యక్షుడిని, ప్రధాన మంత్రిని రప్పించి విషయాలు చర్చించిందో లేదో కూడా తెలియదు. ఒకవేళ ఇటువంటి వేమీ జరగనట్లయితే అది కూడా ఆశ్చర్యమే. అయితే ఇదే కాలంలో గమనించినవలసిందొకటి జరిగింది. బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ఒక సందర్భంలో మాట్లాడుతూ, తాము స్వతంత్రులమని, మద్దతు కోసం ఆర్‌ఎస్‌ఎస్‌పై ఆధారపడి లేమని అన్నారు. ఈ చర్చలోకి వెళ్లేందుకు ఇది సందర్భం కాదు.
ఇక్కడ గుర్తించవలసిన ఒకే ఒక విషయమేమంటే, ఎన్నికలలో ఎదురు దెబ్బలు, భాగవత్ హెచ్చరికల తర్వాత సైతం మోడీ ప్రభుత్వపు తీరు, బిజెపి ధోరణి అణు మాత్రం అయినా మారలేదు. ఈ పరిస్థితిలో చంద్రబాబు, నితీశ్‌లకు సంబంధం ఉండాలన్నది ఇక్కడ చర్చించవలసిన అసలు విషయం. వీరిద్దరు మతతత్వ బిజెపితో కాకుండా సెక్యులర్ ఇండియా కూటమిలో కలవాలనే ప్రయత్నాలు ఆ కూటమి వైపు నుంచి జరగటం తెలిసిందే. కాని ఉభయులూ తమ రాష్ట్రాల ప్రయోజనాల కోసమని ఎన్‌డిఎలో చేరారు. నిజం చెప్పాలంటే ఇండియా కూటమికి ఎన్‌డిఎతో పోల్చగల సుస్థిరత లేదు కూడా. పైగా నితీశ్ ఎన్నికల ముందు నుంచే ఎన్‌డిఎలో ఉన్నారు.
ఇండియాలో ఒకవేళ చేరినా బీహార్‌లోని ఇతర పార్టీలతో ఆయనకు సరిపడేది కాదు. మరొక వైపు తనకు బిజెపి మతతత్వం పట్ల ప్రత్యేకమైన వ్యతిరేకత చాలా కాలంగా లేదు. చంద్రబాబు విషయం కూడా అంతే. ఎన్‌డిఎలో చేరినందున తన రాష్ట్రంలో సమస్య లేదు. వీటన్నింటికి మించి ఇరువురికీ మోడీ ప్రభుత్వం ద్వారా సమకూరగల ప్రయోజనాలు అనేకం ఉంటాయి. ఈ కోణాల నుంచి వారి కూటమి సర్ది చెప్పుకోగలదే. కాని విషయం అది కాదు. స్వయంగా భాగవత్ పేర్కొన్న అంశాలను, దేశ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు, ఇప్పటికీ అదుపు లేకుండా కొనసాగుతున్న మతతత్వ ధోరణులను, చర్యలను నిర్మూలించడం వారి చేతిలో లేకపోయినా అదుపు అయేట్లు చేయడం సాధ్యమే. అందుకోసం వారు చేయవలసింది అటువంటివి తగదని మోడీపై గట్టి వత్తిడి తీసుకు రావడం.
టంకశాల అశోక్
9848191767