న్యూఢిల్లీ: నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకింగ్ చట్టాలు(సవరణ) బిల్లు 2024ను లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లును నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2024 ప్రసంగంలో ప్రకటించారు. దీనిని గత శుక్రవారం కేంద్ర కేబినెట్ ఆమోదించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1955, బ్యాంకింగ్ కంపెనీల (స్వాధీనం మరియు బదిలీలు) చట్టం 1970 , బ్యాంకింగ్ కంపెనీల (సముపార్జన ,అండర్‌టేకింగ్‌ల బదిలీ) చట్టం 1980 లను ఈ బిల్లు సవరించే ప్రతిపాదనలు చేసింది.
ఇదిలావుండగా వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటుకు సంబంధించి కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియా చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో వాయిదా తీర్మానం దాఖలు చేసింది.
ఆగస్ట్ 8న బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం వక్ఫ్ చట్టం 1995ను సవరించడానికి వక్ఫ్ (సవరణ) బిల్లు 2024ను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ సవరణపై తీవ్ర చర్చ జరిగిన తర్వాత , ప్రతిపాదిత మార్పులు ‘వివక్షత కూడుకున్నవని’ ప్రతిపక్షాలు వాదించాక, ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేశారు.