ఢిల్లీ మద్యం వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న ఎంఎల్‌సి కవితకు బెయిల్ వస్తుందని అనుకుంటున్నట్లు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కవిత బెయిల్‌కు సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఛార్జిషీట్ వేశాక ఇంకా జైళ్లో ఉంచాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. మనీశ్ సిసోడియాకు బెయిల్ వచ్చిందని సహజంగానే కేజ్రీవాల్, కవితలకు కూడా బెయిల్ వస్తుందని అనుకుంటున్నట్లు తెలిపారు. కవిత ఆరోగ్య పరిస్థితిపై కెటిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఆమె 11 కిలోల బరువు తగ్గారని, బిపి, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జైలు పరిశుభ్రంగా లేదని అన్నారు. కవిత కేసుతో పాటు నామినేటెడ్ ఎంఎల్‌సిలకు సంబంధించి న్యాయనిపుణులను కలిసేందుకే ఢిల్లీ వెళ్లినట్లు వివరించారు. కవిత బెయిల్ కోసం అప్పీల్ చేశామని, వచ్చే వారంలో బెయిల్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నామన్నారు. సిసోడియాకు వచ్చింది కాబట్టి మిగతా వాళ్లకు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. జైలుకు వెళ్లి వచ్చిన వాళ్లు భవిష్యత్‌లో పెద్ద లీడర్లు అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోందని కెటిఆర్ పేర్కొన్నారు.