ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. పలు కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపి రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలని సిఎం వారికి సూచిస్తున్నారు. రాష్ట్రానికి వస్తే తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామ ని, దీంతోపాటు రాయితీలు కల్పిస్తామని హామీనిస్తున్నారు. సిఎం రేవంత్ రెడ్డి పెట్టుబడుల విషయంలో వేగంగా అడుగులు వేస్తున్నారు. సిఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్‌బా బు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధి కారులు అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలోనే అతి పెద్ద బయో టె క్నాలజీ సంస్థ అయిన ఆమ్‌జెన్ కంపెనీ హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులకు సిద్ధం అయ్యింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆమ్‌జెన్ కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగంతో ఈ మేరకు సి ఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ఒప్పందం చే సుకున్నారు. బయోటెక్నాలజీ దిగ్గజ సంస్థ ఆమ్‌జెన్ హైదరాబాద్‌లో టెక్నాలజీ, ఇన్నేవేషన్ సెంటర్‌ను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. హైటెక్ సిటీలో ఈ విభాగం ఏర్పాటు కానుంది.
సిఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆమ్‌జెన్ ఆర్ అండ్ డి కేంద్రంలో డాక్టర్ డేవిడ్ రీస్, మిస్టర్ సోమ్ చటోపాధ్యాయతో సమావేశమయ్యారు. ఇక్క డ పెట్టుబడులు పెట్టాలన్న సిఎం, మంత్రి అభ్యర్థనకు కంపెనీ ప్రతినిధులు అంగీకారం తెలిపారు. మెడిసిన్, లైఫ్‌సైన్సెస్, డేటా సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో ప్రపంచ స్థాయి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్టు వారు తెలిపారు. ఈ సంస్థ ఏర్పాటైతే మూడు వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆమ్‌జెన్ 40 ఏళ్ల నుంచి బయోటెక్నాలజీ రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. ఇండియాలో ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. దీనిపై సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆమ్‌జెన్ హైదరా బాద్‌లో ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించడం శుభసూచికమన్నారు. నగరం ఆవిష్కరణలు, సాంకేతికతకు కేంద్రంగా ఉందని తెలిపారు. రోగులకు సేవ చేయాలన్న ఆమ్‌జెన్ మిషన్ ముందుకు రావడం అభినందనీయమని సిఎం రేవంత్ పేర్కొన్నారు.
హైటెక్ సిటీలో ఆరు అంతస్తుల భవనంలో ఈ సెంటర్
అమెరికాలోనే అతి పెద్ద బయో టెక్నాలజీ కంపెనీ అయిన ఆమ్‌జెన్ తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించనుంది. హైదరాబాద్ లో కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ విభాగం ప్రారంభించనున్నట్లు ఈ కంపెనీ ప్రకటించింది. హైటెక్ సిటీలో ఆరు అంతస్తుల భవనంలో ఈ సెంటర్ ఏర్పాటుకానుంది. దాదాపు 3 వేల మందికి ఇక్కడ ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ ఏడాది చివరి త్రైమాసికం నుంచే ఈ కంపెనీ రాష్ట్రంలో తమ కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఆమ్‌జెన్ కంపెనీ ప్రపంచంలో వంద దేశాల్లో విస్తరించి ఉండగా ఈ సంస్థలో దాదాపు 27 వేల మంది ఉద్యోగులున్నారు.
రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టుల్లో తాము భాగస్వాముల అవుతాం: అడోబ్ సిస్టమ్స్ సీఈఓ
కాలిఫోర్నియాలోని పలువురు గ్లోబల్ బిజినెస్ లీడర్లతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. అందులో భాగంగా ప్రఖ్యాత అడోబ్ సిస్టమ్స్ సీఈఓ శంతను నారాయణ్‌తో సిఎం రేవంత్ భేటీ అయ్యారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం తలపెట్టిన హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ నిర్మాణం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు ప్రణాళికలపై శంతను నారాయణ్ ఆసక్తి కనబరిచారు. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టుల్లో తాము భాగస్వామ్యం పంచుకునేందుకు సీఈఓ శంతను నారాయణ్ అంగీకరించారు. టెక్ విజనరీ శంతను నారాయణ్‌ను కలుసుకోవటం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
సిఎం రేవంత్ యాపిల్ పార్క్ సందర్శన
రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధే లక్ష్యంగా సిఎం రేవంత్‌రెడ్డి టీం అమెరికా పర్యటన సాగుతోంది. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వివిధ కంపెనీలతో ఐదు రోజుల్లోనే 10 పెద్ద ఒప్పందాలు చేసుకున్నారు. బుధవారం రాత్రి వరకు న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్, డల్లాస్, టెక్సాస్‌లో పర్యటించిన సిఎం రేవంత్ రెడ్డి టీం శుక్రవారం కాలిఫోర్నియా చేరుకుంది. శుక్రవారం కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్‌ను సందర్శించారు. 175 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపస్ ప్రముఖ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది.