కెసిఆర్ పాలనలో సాగుకు స్వర్ణయుగం అయితే కాంగ్రెస్ రాగానే వ్యయసాయానికి గడ్డుకాలం వచ్చిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. ఒక్క ఏడాదిలోనే 15.30 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిందని, ఆగమవుతున్న తెలంగాణ రైతు బతుకుకు తొలి ప్రమాద సంకేతం ఇదేనని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. దశాబ్ద కాలంలోనే దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణలో 8 నెలల్లో ఎందుకింత విధ్వంసమని ప్రశ్నించారు. మొన్న వ్యవసాయానికి కరెంట్ కట్, నిన్న రుణమాఫీ రైతుల సంఖ్య కట్, నేడు సాగుచేసే భూ విస్తీర్ణం కట్ అంటూ ఎద్దేవా చేశారు. రుణమాఫీ పేరుతో మభ్యపెట్టి పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టడం వల్లే రైతులకు ఈ అవస్థ అని విమర్శించారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయ్ కానీ చేతలు సచివాలయం గేటు దాటడం లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకునే విజన్ ప్రభుత్వానికి లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సుంకిశాతం ఘటనలో మెగా సంస్థపై చర్యలేవి..?
సుంకిశాల ప్రాజెక్ట్‌లో ప్రహారీ గోడ కూలిన ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని కెటిఆర్ ప్రశ్నించారు. ప్రమాదం జరిగి 10 రోజులైన కాంట్రాక్ట్ ఏజెన్సీ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని అడిగారు. తెలంగాణలో ఉన్న మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏజన్సీ పట్ల ఎందుకు అంత మెతక వైఖరితో వ్యవహరిస్తోందో చెప్పాలని కెటిఆర్ రాహుల్ గాంధీని నిలదీశారు. సుంకిశాల ప్రమాదానికి కాంట్రాక్ట్ సంస్థ కారణమైతే ఆ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టి ప్రమాదంపై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే కెటిఆర్ కోరారు.
కోల్‌కత్తాలో ట్రైనీ డాక్టర్‌ను రేప్ చేసి హత్య చేసిన వారిని వదలొద్దు
కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌ను రేప్ చేసి హత్య చేసిన సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని కెటిఆర్ పేర్కొన్నారు. హాస్పిటల్‌లో కూడా డాక్టర్లు సురక్షితంగా ఉండకపోతే మన ఆడపిల్లలు ఇంకెక్కడ క్షేమంగా ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇంత క్రూరమైన ఘటనకు పాల్పడిన వారిని వదిలిపెట్టకూడదని బెంగాల్ ప్రభుత్వానికి కెటిఆర్ విజ్ఞప్తి అన్నారు. బెంగాల్‌లోని మమతా సర్కార్ నేరస్తున్ని పట్టుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు. నిరసన తెలుపుతున్న డాక్టర్లకు కెటిఆర్ సంఘీభావం తెలిపారు.