ఓ గిరిజనుడి భూ వ్యవహారానికి సంబంధించి రూ 50 వేలు లంచం తీసుకుంటున్న స్థానిక డిప్యూటి కలెక్టర్ సంజీవ్ జాధవర్‌ను ఎసిబి అదుపులోకితీసుకుంది. ఈ విషయాన్ని అధికారులు బుధవారం తెలిపారు. ఓ గిరిజన వ్యక్తి మరో గిరిజనుడి నుంచి భూమి కొనుగోలు చేయాలనుకున్నాడు. దీనికి సంబంధించి క్రయవిక్రయ లావాదేవీల అనుమతికి మహారాష్ట్రలోని ఫల్ఘార్ జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని ఆశ్రయించారు.
ఈ నెల 1న అర్జీ పెట్టుకున్నాడు. ఈ దశలో డిప్యూటీ కలెక్టరు ఇందుకు లంచం అడిగినట్లు తెలిసింది. దీనితో ఈ వ్యక్తి అదేరోజు అవినీతి నిరోధక శాఖ వద్దకు వెళ్లి సంగతి తెలిపాడు. సబ్ కలెక్టరు తరఫున గుమాస్తా బేరానికి దిగడం, చెప్పినట్లుగా రూ 50 వేలు సబ్‌కలెక్టరుకు అప్పగించే దశలో ఎసిబి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అవినీతి నిరోధక చట్టం పరిధిలో ఆయనను అరెస్టు చేసి ఈ నెల 17 వ తేదీ వరకూ పోలీసు కస్టడీకి తరలించారు.