Thursday, September 19, 2024

పసిమొగ్గలపై దమనకాండ

- Advertisement -
- Advertisement -

మొన్నీమధ్యన ఇరాక్ బాలికల వివాహ వయసును తగ్గించింది. ఇజ్రాయెల్ పిల్లలు చదివే పాఠశాల మీద బాంబుల దాడి జరిపింది. ఉక్రెయిన్ దేశంలో రష్యా కొనసాగిస్తున్న మారణహోమంలో ఎంతో మంది పిల్లలు అశువులు బాస్తున్నారు. మన దేశంలో పసిమొగ్గలపై అత్యాచారం జరిపి హత్యలు చేస్తున్నారు. ఆగస్టు 12 సోమవారం అన్నమయ్య జిల్లాలో బాలిక పరువు హత్యకు గురైంది. ఇవన్నీ పిల్లలపై జరుగుతున్న అకృత్యాలే! ఈ దేశం, ఆ దేశం అనే బేధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా పిల్లలు హానికి, వివిధ రకాల హింసకు, అనేక రకాలుగా శారీరక, మానసిక హింసకు గురవుతున్నారు.

ఇవన్నీ చూస్తే మనమున్నది ఆధునిక సమాజంలోనేనా? లేదా ఆటవిక సమాజంలోనా? అనే సందేహం కలుగుతుంది. నేటి పిల్లలే భవిష్యత్ నిర్మాతలని మనకు తెలియదా? లేక తెలిసే చేస్తున్నామా? దేశాల మధ్య ఆధిపత్య పోరులో ఎక్కువగా బలవుతున్నది పిల్లలనేది కాదనలేని నిజం. లైంగిక వేధింపులు, దోపిడీ, అక్రమ రవాణా, అపహరణ ఇవి నేడు ప్రపంచ వ్యాప్తంగా పిల్లలు ఎదుర్కొంటున్న అకృత్యాలు. ఈ మధ్యన ఇజ్రాయెల్ గాజా నగరంలో ఉన్న చాలా పాఠశాలల మీద దాడులు జరుపుతూనే ఉంది. దీని కారణాన అభంశుభం ఎరుగని పిల్లలు బలైపోతూనే ఉన్నారు. ఇది అంతర్జాతీయ యుద్ధ నియమాల ఉల్లంఘన కిందకే వస్తుంది.

7 అక్టోబర్ 2023 నాటి నుండి నేటి వరకూ పాలస్తీనాలో సుమారు 21,000 మంది పిల్లలు చనిపోయారు. వందల మంది పిల్లలు భవనాల దిగువన శిథిలమైపోయారు. అనేక మంది గాయాల పాలయ్యారు. ఎంతో మంది వారి తల్లిదండ్రులకు దూరమయ్యారు. అలాగే ఉక్రెయిన్ మీద రష్యా కొనసాగిస్తున్న యుద్ధంలో కూడా సుమారు రెండు వేలకు పైగా పిల్లలు మరణించారు. ఇంకా సూడాన్ లాంటి దేశాలలో అంతర్గత పోరులో చాలా మంది పిల్లలు బలైపోతున్నారు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా సంఘర్షణ ప్రాంతాలలో నివసిస్తున్న సుమారు మూడు కోట్లకు పైగా పిల్లలు అధిక స్థాయి ఒత్తిడిని అనుభవిస్తున్నారని, తేలికపాటి నుండి మితమైన మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారని, అదనంగా ఏడు లక్షల మంది పిల్లలు తీవ్రమైన మానసిక ఆరోగ్య రుగ్మతలకు గురవుతున్నారని అంతర్జాతీయ నివేదికలు తెలుపుతున్నాయి. వీటి మూలాన వారు పాఠశాలలకు దూరమైపోతున్నారు.

అనేక రోగాలకు దగ్గరవుతున్నారు. గాజాలో విద్య పూర్తిగా లేకపోవడంతో 6,25,000 మంది పిల్లలు పాఠశాలకు దూరంగా ఉన్నారు. ఐదేళ్లలోపు పిల్లలందరూ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఆహార అభద్రత లేదా అధ్వానమైన సంక్షోభ స్థాయిలను ఎదుర్కొంటున్నారు. నిరంతర బాంబు దాడులు, ఆంక్షలు, ఆహారం, నీటికి అత్యంత పరిమితమైన ప్రాప్యతతో పోషకాహార లోపం విపరీతమైన పరిస్థితులను సృష్టించాయి. గాజాలో దాదాపు పిల్లలు అందరు కరువు బారిన ఉన్నారు. ఈ జూన్ నాటికి ఉక్రెయిన్‌లో పిల్లలు నాలుగు విద్యా సంవత్సరాలు కోల్పోయారని, దేశ వ్యాప్తంగా దాదాపు పది లక్షలకు పైగా పిల్లలు అభద్రత కారణంగా వ్యక్తిగతంగా నేర్చుకోలేకపోతున్నారని యునిసెఫ్ తెలిపింది. ఉక్రెయిన్‌లోని దాడులు పిల్లల మానసిక, ఆరోగ్యం, శ్రేయసును హానికరంగా ప్రభావితం చేశాయి. పిల్లలలో సగం మంది నిద్ర లేమితో ఇబ్బందిపడుతున్నారు.

ఐక్యరాజ్య సమితి బాలల హక్కులు పుస్తకాల్లో తప్ప నిజజీవితంలో మాత్రం అమలు కావడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో పిల్లలకోసం అనేక సంస్థలు ఉన్నా ఏమి లాభం? కేవలం చర్చించడానికి, నీతులు చెప్పడానికి మాత్రమే ఇవి వున్నాయా? ఈ విషయాలన్నీ పెద్దన్న దేశానికి తెలియదా? లేదా వాళ్లకు తెలిసే జరుగుతుందా? నిజాలు బహిరంగ రహస్యాలే ! ఇరాక్‌లో బాలికల కనీస వివాహ వయసును తొమ్మిది సంవత్సరాలకు తగ్గించాలని అక్కడ ప్రభుత్వం భావిస్తోంది. దేశ పర్సనల్ స్టేటస్ లా ను సవరించాలని ఇరాక్ న్యాయ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన ఈ వివాదాస్పద బిల్లు ప్రయత్నిస్తోంది. జులై చివరిలో చట్టసభ సభ్యుల నుండి పెద్ద ఎత్తున అభ్యంతరాల రావడంతో ప్రతిపాదిత మార్పులను పార్లమెంటు ఉపసంహరించుకుంది.

ఛాంబర్‌లో గణనీయమైన ఆధిపత్యం ఉన్న ప్రభావవంతమైన షియా కూటముల మద్దతు పొందిన తరువాత ఆగస్టు 4 న జరిగిన సమావేశాల్లో ఈ బిల్లు తిరిగి కనిపించింది. ప్రస్తుతం 1959 పర్సనల్ స్టేటస్ చట్టం ప్రకారం బాలికల చట్టబద్ధ వివాహ వయస్సు 18 ఏళ్లుగా ఉంది. ఇరాక్‌లో రాచరికం పతనమైన తరువాత ఈ చట్టం కుటుంబ విషయాలను నిర్ణయించే అధికారాన్ని మత పెద్దల నుండి ప్రభుత్వానికి, దేశంలోని న్యాయ వ్యవస్థకు మార్చింది. ఇరాక్‌లో 28% మంది అమ్మాయిలకు 18 ఏళ్లు నిండక ముందే పెళ్లిళ్లు అయ్యాయని యూనిసెఫ్ తెలిపింది. ప్రతిపాదిత బిల్లులో వివాహం, విడాకులు, పిల్లల సంరక్షణ వంటి కుటుంబ విషయాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని మతపరమైన అధికారులు లేదా పౌర న్యాయ వ్యవస్థలో ఒక దాన్ని ఎంచుకోవడానికి పౌరులకు ఈ బిల్లు అనుమతిస్తుంది. ఈ ప్రతిపాదిత బిల్లుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ప్రజలు ఇప్పటికే నిరసనలు చేపట్టారు. ఇది వారసత్వం, విడాకులు, పిల్లల సంరక్షణ వంటి రంగాలలో హక్కులను హరిస్తుందని ఆందోళన చెందుతున్నారు.

ఈ బిల్లు ఆమోదించినట్లయితే బాల అత్యాచారాలను చట్టబద్ధం చేసినట్లేనని మహిళా హక్కుల న్యాయవాదులు ఆందోళన చెందుతున్నారు. ఈ మార్పు మహిళల హక్కులకు భంగం కలిగిస్తుందని, దేశంలోని పితృస్వామ్య సమాజంలో బాల్య వివాహాలు పెరగడానికి దారితీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. దురదృష్టవశాత్తూ ఈ చట్టాన్ని సమర్థించే పురుష ఎంపిలు మైనర్‌ని పెళ్లి చేసుకోవడంలో తప్పేముందని అడుగుతున్నారు. మన దేశంలో జాతీయ నేర గణాంక సంస్థ (నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో) ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత రెండేళ్లలో పిల్లలపై నేరాలు 26% పెరిగాయి. దేశ వ్యాప్తంగా 2020 సం.లో చిన్నారులపై నేరాలకు సంబంధించి 1.28 లక్షల కేసులు నమోదు చేయగా, 2022 సం.లో 1.62 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రతి లక్ష మంది పిల్లల జనాభాకు నమోదైన నేరాల రేటు 2021లో 33.6 తో పోలిస్తే 2022లో 36.6 గా ఉంది. 2022లో 83,350 మంది పిల్లలు తప్పిపోయారు. వీరిలో 20,380 మంది బాలురు, 62,946 మంది బాలికలు, 24 మంది ట్రాన్స్‌జెండర్లు. ఇప్పటికీ 2,946 బాలికల ఆచూకీ తెలియడం లేదు. 2021లో తప్పిపోయిన పిల్లల సంఖ్య 77,535 నుండి 2022లో 7.5% పెరిగింది. పోక్సో చట్టం అమలులో ఉన్నా నేరాలు తగ్గడం లేదు.

డిజె మోహన్ రావు

9440485824

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News