న్యూఢిల్లీ: ఎర్రకోటలో 78 వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ప్రతిపక్షనేత రాహుల్ గాంధీకి సీటు కేటాయింపు చర్చకు దారి తీసింది. ప్రోటోకాల్ ప్రకారం లోక్‌సభలో ప్రతిపక్షనేత, క్యాబినెట్ మంత్రులకు సమానంగా ముందు వరుసలో సీట్లు కేటాయిస్తారు. ముందు వరుసలో చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్, అమిత్‌షా, ఎస్. జైశంకర్ కూర్చున్నారు. మొదటి వరుస అంతా ఒలింపిక్ పతక విజేతలు మనుభాస్కర్, సరబ్‌జోత్ సింగ్, ఒలింపిక్ కాంస్య విజేతలైన హాకీ జట్టు, ఆ జట్టు కెప్టెన్ హర్‌మన్‌ప్రీత్ సింగ్, పిఆర్‌శ్రేజేష్, తదితరులు రాహుల్ కన్నా ముందు వరుసలో కూర్చున్నారు.
తెల్లటి కుర్తా, పైజామా ధరించిన రాహుల్ భారత హాకీ జట్టు నాయకుడు గుర్జంత్ సింగ్ వెనుకన ఒలింపిక్ విజేతలతో కలిసి రెండో ఆఖరి వరుసలో కూర్చున్నారు. గత దశాబ్ద కాలంలో లోక్‌సభలో విపక్షనేత ఎర్రకోట వద్ద స్వాతంత్య్ర దినోత్సవ వేడులకు హాజరు కావడం ఇదే మొదటిసారి. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీనిపై ప్రభుత్వం స్పందించింది. ఒలింపిక్ విజేతలకు ముందు వరుసలో సీట్లు కేటాయించడంతో కాంగ్రెస్ ఎంపీలకు వెనక వరుసలో సీట్లు కేటాయించినట్టు రక్షణ మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడం, ఆ మేరకు సీట్లు కేటాయించడం రక్షణ మంత్రిత్వశాఖ బాధ్యత.
లోక్‌సభలో విపక్ష నేతకు సాధారణంగా ముందు వరుస లోనే సీటు కేటాయించడం ప్రోటోకాల్ ప్రకారం పరిపాటి. వాజ్‌పాయ్ ప్రధానిగా ఉన్న కాలంలో అప్పటి లోక్‌సభ విపక్ష నాయకురాలు సోనియా గాంధీకి మొదటి వరుసలోనే సీటు కేటాయించేవారు. అయితే 2014 నుంచి లోక్‌సభలో విపక్ష నేత స్థానం ఖాళీగా ఉంటోంది. ఏ పార్టీ కూడా దిగువ సభలో విపక్షనేత స్థాయిని పొందే సభ్యుల సంఖ్యను సాధించలేదు. మళ్లీ 2024 లోక్‌సభ ఎన్నికల్లోనే కాంగ్రెస్ 99 స్థానాల వరకు సంఖ్యను సాధించుకుంది. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు క్రమంగా 44, 52 స్థానాలు వచ్చాయి. మొత్తం 543 సభ్యుల లోక్‌సభలో విపక్షనేత హోదాకు తగిన బలం కాంగ్రెస్‌కు లభించలేదు.
ఇది ప్రజాస్వామ్య సంప్రదాయాలపై ప్రధానికి చిన్నచూపు: కాంగ్రెస్
లోక్‌సభలో ప్రతిపక్షనాయకుడైన రాహుల్ గాంధీని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఐదో వరుసలో కూర్చోబెట్టడం ప్రజాస్వామ్య సంప్రదాయాలపై ప్రధాని మోడీకి చిన్నచూపు ఉండడమేనని కాంగ్రెస్ మండిపడింది. పారిస్ ఒలింపిక్స్ పతక విజేతలను ప్రత్యేక అతిధులుగా గౌరవించడానికే ఈ ఏడాది ప్రాధాన్యత బట్టి సీటింగ్ విధానం నిర్ణయించడమైందని ఆయా వర్గాలు వెల్లడించడంతో కాంగ్రెస్ విమర్శల దాడి చేసింది. ప్రధాని మోడీ సంకుచిత మనస్తత్వం కలవారని, దానికి తానే రుజువు ఇస్తుంటారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనతే వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీనే కాదు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కూడా ఐదో వరుసలో కూర్చోబెట్టారని విమర్శించారు. ఒలింపిక్ క్రీడాకారులను గౌరవించడానికే ఇలా జరిగిందని రక్షణ మంత్రిత్వశాఖ వివరణ ఇవ్వడాన్ని కూడా ఆమె తప్పు పట్టారు. వారు గౌరవించాలనుకుంటే వినేష్ ఫోగట్‌ను కూడా గౌరవించాలి. కానీ అమిత్‌షా, జెపి నడ్డా, ఎస్.జైశంకర్, నిర్మలా సీతారామన్ వారిని గౌరవించాలని కోరుకోవడం లేదా? అని ప్రశ్నించారు. అసలు వాస్తవం ఏమంటే మోడీ, ఆయన మంత్రులు రాహుల్ వల్ల ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్యానించారు.
“రాహుల్ ఐదో వరుసలో ఉన్నా, ఏబయ్యో వరుసలో ఉన్నా ఆయన ప్రజానాయకుడు గానే ఉంటారు. ఈ చెత్తపనులు మీరెప్పుడు ఆపేస్తారు ?” అని ఆమె నేరుగా బీజేపీ నేతలను ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుడు వివేక్ టంఖా తన విమర్శలో ‘ మోడీ ఎందుకు అలా చిన్నబుద్ధితో ప్రవర్తిస్తారు? లోక్‌సభలో ప్రతిపక్షనేత అంటే క్యాబినెట్ మంత్రి కన్నా ఎక్కువ. రాజ్‌నాథ్ సింగ్‌జీ , మీరు రక్షణ మంత్రిత్వశాఖను జాతీయ స్థాయి కార్యక్రమాల్లో రాజకీయంగా మార్చకండి. మీ నుంచి ఇది ఆశించడం లేదు ” అని వ్యాఖ్యానించారు.