Thursday, January 2, 2025

హసీనాపై ఐసిటి దర్యాప్తు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

ఢాకా: ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు జులై 15 నుంచి ఆగస్టు 5 వరకు సాగించిన ప్రజా ఆందోళన సందర్భంగా జరిగిన మారణహోమం, నేరాలకు సంబంధించిన ఆరోపణలపై మాజీ ప్రధాని షేక్ హసీనా, మరో 9 మందిపై బంగ్లాదేశ్‌కు చెందిన అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్(ఐసిటి) దర్యాప్తు ప్రారంభించింది. హసీనాపై ఐసిటిలో బుధవారం ఒక ఫిర్యాదు నమోదైంది. ఆమెతోపాటు మాజీ రోడ్డు రవాణా, వంతెనల మంత్రి ఓబైదుల్ ఖ్వాసదర్, మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, పలువురు ప్రముఖ వ్యక్తులపై కేసు నమోదైంది.

ఐఇసి బుధవారం రాత్రే దర్యాప్తును ప్రారంభించినట్లు ఫిర్యాదుదారుని తరఫు న్యాయవాది గాజీ ఎంహెచ్ తమీమ్ ధ్రువీకరించారు. విద్యార్థుల సారథ్యంలో ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో ఆగస్టు 5న ప్రధాని పదవికి రాజీనామా చేసిన 76 ఏళ్ల హసీనా భారత్‌కు వెళ్లిపోయారు. హసీనా నాయకత్వంలోని ఆవామీ లీగ్, దాని అనుబంధ సంఘాల పేర్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. వివక్షకు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో హతమైన ఆరిఫ్ అహ్మద్ సియామ్ అనే 9వ తరగతి విద్యార్థి తండ్రి బుల్‌బుల్ కబీర్ ఈ ఫిర్యాదును దాఖలు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News