Thursday, September 19, 2024

కార్పొరేట్లకు మోకరిల్లుతున్న మోడీ

- Advertisement -
- Advertisement -

కేంద్రంలో మూడోసారి ఎన్‌డిఎ పక్షాల సహకారంతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం 48 లక్షల 20 వేల 512 కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ తీరుతెన్నులను పరిశీలిస్తే దేశంలో ఉన్న పిడికెడు మంది శతకోటీశ్వరులను సంపదను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం వంద కోట్ల మంది ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలి వేసినట్లుందని చెప్పవచ్చు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను గమనిస్తే 100 కోట్ల మంది ప్రజలకు కేటాయించాల్సిన నిధులను అంబానీ, అదానీ, తదితర శత కోటీశ్వరులకు కట్టబెట్టేందుకు రూపొందించబడినట్లుగా అర్థమవుతున్నది. అందుకే ఇది ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, మహిళా వ్యతిరేక, పారిశ్రామిక వ్యతిరేక బడ్జెట్‌గా చెప్పవచ్చు.

మొత్తంగా సంక్షేమాన్ని వదులుకొనే మోడీ ప్రభుత్వ విధానాన్ని తెలియజేస్తున్నది. బడ్జెట్ స్వరూపాన్ని ఒక్కమాటలో చెప్పాలంటే ఇది అన్ని వర్గాల సంక్షేమానికి గొడ్డలిపెట్టుగా ఉందని, సంపన్నుల బొజ్జలు నింపేందుకు పేదల కడుపు కొట్టేదిగా ఉందని స్పష్టంగా చెప్ప వచ్చు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రవేశపెడుతున్న బడ్జెట్లలో ప్రజా సంక్షేమానికి క్రమంగా నిధులను తగ్గిస్తూ వస్తున్నది. దేశంలో 87 కోట్ల మంది పేదలకు ఉచిత బియ్యాన్ని ఇస్తున్నట్లు భవిష్యత్తులో కూడా దీనిని కొనసాగిస్తామని ఎన్నికల ప్రచారం లో ప్రధాని చెప్పారు. దేశంలో రేషన్ కార్డులు లేనివారు ఎందరో ఈ లెక్కలో రాకుండా ఉన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఆహార సబ్సిడీకి 2022-23 బడ్జెట్‌లో రూ. 2,72,802 కోట్లు కేటాయించగా, 2023- 24లో రూ. 2,12,332 కోట్లు కేటాయించారు. ప్రస్తుత 2024 -25 బడ్జెట్‌లో రూ. 2,05,250 కోట్లు మాత్రమే కేటాయించారు.

అంటే ఒక్క ఆహార సబ్సిడీలోనే గత మూడేళ్ల కాలంలో క్రమంగా రూ. 67,552 కోట్లు ఆహార సబ్సిడీలు తగ్గించారు. మొత్తంగా ఆహార సబ్సిడీకి 2022-23లలో కేంద్ర బడ్జెట్లో 6.51% నిధులను కేటాయిం చగా, 2024 -25లో 4.26% మాత్రమే కేటాయించడం జరిగింది. అదే విధంగా రైతుల ఎరువులకు ఇస్తున్న సబ్సిడీకి సంబంధించి 2022 -23లో రూ. 2,51,339 కోట్లు కేటాయించగా, 2023 -24 లో రూ. 1,88,894 కోట్లు, 2024- 25 బడ్జెట్లలో రూ. 1,64,000 కోట్లు కేటాయించారు. మూడు బడ్జెట్ల కాలంలో మొత్తంగా రూ. 87,339 కోట్ల సబ్సిడీని తగ్గించారు. రైతులకు ఇస్తున్న యూరియాకు 2022 -23లో రూ. 1,65217 కోట్లు కేటాయించగా, 2023 -24లో 1,51,100 కోట్లు, 2024 -25 బడ్జెట్లో రూ. 1,00,340 కోట్లు కేటాయించారు. అంటే రూ. 65,217 కోట్లు మూడు బడ్జెట్ల కాలంలో యూరియాకి ఇస్తున్న సబ్సిడీని తగ్గించి రైతులపై భారాన్ని పెంచారు.

అంతేకాకుండా బడా కార్పొరేట్లకు రూ. 16 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను రద్దు చేసిన మోడీ ప్రభుత్వం వ్యవ సాయ రంగంలో సాగుకు అప్పులు చేసిన రైతాంగానికి రూ. 5 లక్షల కోట్ల పంట రుణాలు మాఫీ చేయడానికి సిద్ధంగా లేదు. మొత్తంగా వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఇచ్చిన ప్రాధాన్యతను గమనిస్తే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 2019-20లో 5.44%, 2020-21లో 5.08%, 2021- 22లో 4.06%, 2022- 23లో 3.84%, 2023-24లలో 3.20%, 2024-25 లలో 3.15% నిధులను కేటాయించారు. 145 కోట్ల మందికి కడుపు నింపే అన్నదా తలకు ఇస్తున్న ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ఏటా వ్యవసాయ రంగానికి కేటాయిస్తున్న బడ్జెట్ ఎలా తగ్గిస్తూ వచ్చారో స్పష్టంగా అర్థం అవుతుంది. జైజవాన్, జైకిసాన్ అంటున్నా దేశంలో అన్నదాతలకు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ శక్తులు ఇస్తున్న ప్రాధాన్యత ఎంతో అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయ రంగానికి రైతులకు బడ్జెట్లో ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా కార్పొరేట్ల సంపాదన పెంచేందుకు వారికి రూ. 16 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను రద్దుచేసి వారికి అనేక రాయితీలు కల్పించి కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటూ వస్తున్నది. అందువల్ల ఇది రైతుల ప్రయోజనాలను పట్టించుకోకుండా ఉన్న రైతు వ్యతిరేక ప్రభుత్వమని అర్థం చేసుకొనవచ్చు.

మోడీ ప్రభుత్వం 2018లో తెచ్చిన ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకంలో 10 కోట్ల మంది సభ్యులున్నారు. రైతులకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నదనే దానితో సంబంధం లేకుండా, కుటుంబంలో ఎంత మందికి పట్టా పాసు పుస్తకాలు ఉన్నాయనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఒక్కరిని మాత్రమే లెక్కగట్టి ఏటా రూ. 6000లు మూడు విడతలుగా ఎకౌంట్లో జమ చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలోనే 47 లక్షల మంది రైతులు ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఈ లెక్కన దేశవ్యాప్తంగా రైతులను పూర్తిగా లెక్కించి వారికి ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం అమలు చేయడానికి అవసరమైన నిధులను కేటాయించడానికి మోడీ ప్రభుత్వం పూనుకొనడం లేదు. 2018 నాటి లెక్కల మీద ఆధారపడి నిధులను పెంచకుండా అన్యాయం చేస్తున్నది. అంబానీ, అదానీల ఆస్తులకు సంబంధించి అక్రమ మార్గాల ద్వారా మోడీ ప్రభుత్వం అండదండలతో సంపాదించిన విషయాన్ని హిండెన్‌బర్గ్ నివేదిక వివరంగా బయటపెట్టింది. దేశప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపిస్తే ప్రజల సంక్షేమాన్ని విస్మరించి పిడికెడు మంది కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలను ఎత్తుకొని ప్రధాని, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు పూనుకోవడం దేశ ప్రజలకు నష్టం. భారత దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమైనది.

జె సీతారామయ్య
9490700954

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News