న్యూఢిల్లీ: బిజెపి నేత సుబ్రమణ్యన్ స్వామి శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో సంచలనాత్మక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) దాఖలు చేశారు. లోక్ సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆయన రాసిన లేఖపై ఏదైనా నిర్ణయం తీసుకోవాలని హోం శాఖకు ఆదేశించేలా హైకోర్టును కోరారు. తన తరఫున న్యాయవాది సత్య సభర్వాల్ పిల్ దాఖలు చేసినట్లు ఆయన ఎక్స్ వేదిక లో ప్రకటించారు. విదేశీ పౌరసత్వం అంశంపై రాహుల్ గాంధీని హోం శాఖ ఎందుకు విచారించడంలేదన్న ప్రశ్నను ఆయన తాజాగా లేవనెత్తారు.
యూకెలో బ్యాకప్స్ లిమిటెడ్ పేరుతో ఉన్న కంపెనీలో డైరక్టర్ గా రాహుల్ గాంధీ ఉన్నారని, అందులో బ్రిటిష్ జాతీయుడిగా పేర్కొన్నారని సుబ్రమణ్యస్వామి తెలిపారు. రెండు దేశాల పౌరసత్వాలను ఏక కాలంలో కలిగి ఉండటం అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 9తో పాటు భారత పౌరసత్వ చట్టం 1955 కింద ఉల్లంఘణ కిందికే వస్తుందని సుబ్రమణ్యన్ స్వామి తన లేఖలో పేర్కొన్నారు.