అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో బిఆర్‌ఎస్ విలీనం కావడం తధ్యమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో కవితకు బెయిల్ వస్తుందని, బిఆర్‌ఎస్ పార్టీ బిజెపిలో విలీనం అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి ంజయ్ శుక్రవారం స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీని బిజెపిలో విలీనం చేసుకుంటేనే ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు బెయిల్ వచ్చిందా అని బండి ప్రశ్నించారు. బిజెపిని బద్నాం చేసేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని బండి సంజయ్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. కవితకు బెయిల్ ఇవ్వాలా? వద్దా? అనేది న్యాయ స్థానం పరిధిలోని అంశమని, కవిత బెయిల్‌కు బీజేపీకి సంబంధమేంటని ప్రశ్నించారు. అయితే అతి త్వరలోనే బిఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడం మాత్రం తధ్యమని విమర్శించారు.
బిఆర్‌ఎస్ పార్టీ ముగిసిన అధ్యాయమని ఎద్దేవా చేసిన బండి సంజయ్ ప్రజలు తిరస్కరించిన ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ తమకు లేదని అన్నారు. బీఆర్‌ఎస్‌ను విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతోందని బండి సంజయ్ పేర్కొన్నారు. పథకం ప్రకారమే ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఇవన్నీ చూస్తుంటే అతి త్వరలోనే కాంగ్రెస్‌లో బిఆర్‌ఎస్ విలీనం కావడం ఖాయమని అన్నారు. త్వరలో రాజ్యసభ ఎన్నికలొస్తున్నందున కవితను కాంగ్రెస్ పక్షాన రాజ్యసభకు పంపినా ఆశ్చర్యపోనక్కర్లేదని బండి సంజయ్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కాళేశ్వరం సహా అనేక అంశాల్లో వేల కోట్ల రూపాయల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ కెసిఆర్, కేటీఆర్‌లను జైలుకు పంపాలని ఆయన సవాల్ చేశారు. కెసిఆర్ కుటుంబ ఆస్తులను జప్తు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దాగుడుమూతలాడుతున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.