ఈ ఏడాది అక్టోబర్‌లో బంగ్లాదేశ్ వేదికగా జరగాల్సిన మహిళల టి20 ప్రపంచకప్‌ను మరో దేశానికి మార్చడం ఖాయంగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో అక్కడ వరల్డ్‌కప్ జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. భారత్‌ను ఈ టోర్నీని నిర్వహించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కోరింది. అయితే బిసిసిఐ ఈ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. వరల్డ్‌కప్ నిర్వహించడం కుదరదని బిసిసిఐ కార్యదర్శి జైషా స్పష్టం చేశారు. దీంతో శ్రీలంక లేదా యుఎఇలలో వరల్డ్‌కప్ నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి భావిస్తోంది. యుఎఇ టోర్నీ నిర్వహించడానికి ముందుకు రావడంతో అక్కడే ఈ ప్రపంచకప్ జరిగే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. కానీ ఆగస్టు 20 తర్వాతే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వరల్డ్‌కప్ టోర్నీ నిర్వహణపై ఒక నిర్ణయానికి రావడానికి తమకు కొంత సమయం కావాలని బంగ్లా క్రికెట్ బోర్డు కోరింది. దీంతో ఐసిసి దీనిపై కొంత సమయం వేచిచూడాలనే ధోరణిలో ఉంది.
అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో అక్కడ వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నమెంట్ నిర్వహించడం దాదాపు అసాధ్యమేనని చెప్పాలి. దీంతో యుఎఇకి ఈ మెగా టోర్నీ మారడం తథ్యంగా కనిపిస్తోంది. ఆగస్టు 20న దీనిపై ఐసిసి తుది ప్రకటన విడుదల చేసే అవకాశాలున్నాయి. కాగా, షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3 నుంచి 20 వరకు మహిళల టి20 వరల్డ్‌కప్ జరగాల్సి ఉంది. వారం రోజుల ముందుగానే సెప్టెంబర్ 27 నుంచి వార్మప్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. కానీ, బంగ్లాదేశ్‌లో అనూహ్య పరిస్థితులు ఏర్పడడంతో అక్కడ టోర్నీ నిర్వహించడం ప్రశ్నార్ధకంగా మారింది. ఈ నేపథ్యంలో ఐసిసి ఇతర చోటికి వేదికను మార్చాలని యోచిస్తోంది. తొలుత బిసిసిఐని ఐసిసి ఈ విషయంలో సంప్రదించింది. కానీ బిసిసిఐ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. దీంతో ఇతర వేదికలపై ఐసిసి దృష్టి సారించింది. ఈ పరిస్థితుల్లో యుఎఇ ముందుకు రావడంతో అక్కడే మెగా టోర్నీ నిర్వహించాలని ఐసిసి భావిస్తోంది.