మన తెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రంలో అనుమతిలేని, చట్టవిరుద్ధమైన లేఅవుట్లు, పాట్ల క్రమబద్ధీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధి, విధానాలను ప్రకటించింది. ఈ మేరకు పురపాలక పరిపాలన, పట్టణాభివృ ద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 2020 ఆగష్టు 26వ తేదీ కంటే ముందు రిజిస్టర్ చేసుకున్న లే ఔట్‌లకు మా త్రమే ఎల్‌ఆర్‌ఎస్ (లే ఔట్ రెగ్యులరైజేషన్ స్కీం) వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. 2020 అక్టోబర్ 15వ తేదీలోపు స్వీకరించిన దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2020 సంవత్సరంలో జారీ చేసిన జీఓ 131, జీఓ 135 ప్రకారం రాష్ట్రంలోని అక్రమ లేఔట్‌లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఈ నియమ, నిబంధనలను రూపొందించింది. ఎల్‌ఆర్‌ఎస్ పై మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగరాభివృద్ధి సంస్థలు, జిల్లా కలెక్టర్‌ల కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
దీనికి సంబంధించి నియమ నిబంధనలు 2020లో విడుదల అయినప్పటికీ ఈ ఏడాది జనవరిలో దరఖాస్తుల పరిశీలన మొదలైందని,అందులో భాగంగా ఇప్పటివరకు దాదాపుగా 4,28,832 దరఖాస్తుల ను పరిశీలించినట్టు ప్రభుత్వం తెలిపింది. అం దులో 60,213 దరఖాస్తులు ఆమోదం పొందాయని, దీంతో రూ.96.60 కోట్లు వసూలు అయినట్లు పురపాలకశాఖ ప్రధాన కార్యదర్శి తెలిపారు. దరఖాస్తులకు సంబంధించి దాదాపు 75 శాతం మంది పూర్తి వివరాలు సమర్పించలేదని పేర్కొన్నారు. కొన్ని దరఖాస్తుల్లో తగిన డాక్యుమెంట్లు లేవని దరఖాస్తుదారులకు ఇప్పటికే తెలియజేశామని, వాటిని అప్‌లోడ్ చేయడం కుదరకపోగా సకాలంలో పరిశీలన చేయలేకపోయామని ప్రధాన కార్యదర్శి చెప్పారు. డాక్యుమెంట్లు అందజేసేందుకు దరఖాస్తుదారులకు అవకాశం కల్పించామని ఆయన ఆ ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. సేల్ డీడ్, ఈసీ, మార్కెట్ విలువ సర్టిఫికెట్, లే ఔట్ కాపీలను అప్‌లోడ్ చేయవచ్చని ఆయన అ ఉత్తర్వుల్లో సూచించారు. దరఖాస్తుదారులు తమ మొబైల్ నంబర్, చిరునామాను ఇతర వివరాల కోసం ఓటిపి ఉపయోగించుకొని ఎడిట్ చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులకు ఏవైనా సందేహాలుంటే హెల్ప్ డెస్క్‌లను సందర్శించి పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.