అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న ట్రంప్ తమ ప్రచారానికి భారతీయత పేరున్న సంతతి నాయకురాలు తులసీ గబ్బర్డ్ సాయం తీసుకోనున్నారు. వచ్చే నెలలో డెమోక్రటిక్ అభ్యర్థిని కమలా హారీస్‌కు రిపబ్లిక్ పార్టీ ఎంచుకున్న ట్రంప్‌నకు మధ్య తొలిసారి అత్యంత కీలకమైన డిబెట్ ఉంది. ఈ డిబేట్‌లో హారిస్‌ను గట్టిగా ఎదుర్కొనే విషయాల గురించి ట్రంప్ తులసీ సాయం తీసుకుంటారు. ప్రచారంలో సహకరించే వారి జాబితాను ట్రంప్ బృందం సిద్ధం చేసుకుంది. ఇందులో తులసీ గబ్బర్డ్ కీలక పాత్ర పోషిస్తారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది. దీంతో తులసీ గబ్బర్డ్ ఎవరని అందరి మదిలో ప్రశ్న పుట్టుకొచ్చింది.
ఎవరీ తులసీ గబ్బర్డ్?
1981 ఎప్రిల్ 12వ తేదీన జన్మించిన తులసీ గబ్బర్డ్ రాజకీయాల్లోకి రాకముందు అమెరికాలో ఆర్మీ రిజర్వ్ ఆఫీసరుగా ఉన్నారు. తరువాత రాజకీయ వ్యాఖ్యాతగా మారారు. ఆమె అమెరికాలోనే జన్మించి, అక్కడనే పెరిగారు. విద్యాభ్యాసం ఇతర విషయాల్లో ఎక్కడ కూడా ఆమెకు భారతదేశంతో ఎటువంటి అనుబంధం లేదు. తులసీ తల్లిదండ్రులు ఇద్దరూ అమెరికన్లే. అయితే తల్లి కరోల్ భర్తతో పిల్లలతో హవాయికి తరలివెళ్లి స్థిరపడిన తరువాత హిందూత్వం సంతరించుకున్నారు.
తులసీ రెండేళ్ల ప్రాయంలో ఉండగా ఇక్కడికి వచ్చిన తరువాత తల్లి హిందూయిజం పట్ల ఆకర్షితులు అయ్యారు. ఈ క్రమంలో ఆమె తన పిల్లలకు హిందూ పేర్లు పెట్టారు. ఈ విధంగా తులసీ గబ్బర్డ్ క్రమేపీ లోకం దృష్టిలో భారతీయ సంతతి వ్యక్తి అయ్యారు. తల్లి మాదిరిగానే తులసీ కూడా ఆలోచనలు ఆచరణల్లో భారతీయ మౌలికతను సంతరించుకున్నారు.