Monday, December 23, 2024

కోరలు సాచిన మరో మహమ్మారి

- Advertisement -
- Advertisement -

వైరల్ వ్యాధుల విజృంభణ ఇటీవలి కాలంలో ఎక్కువవుతోంది. వైరస్ అంటే లాటిన్ భాషలో విషమని అర్థం. ఈ పేరును సార్థకం చేసేలా.. కంటికి కనిపించని అకణజీవులు మారణహోమం సృష్టిస్తున్నాయి. ఎబోలా, జికా, డెంగీ, సార్స్, కరోనా వంటి వైరస్ లన్నీ ఈ కోవకు చెందినవే. ఒకప్పుడు ఉష్ణమండల దేశాలకే వైరల్ వ్యాధులు పరిమితమని భావించేవారు. ఇప్పుడు అవి ఎల్లలు దాటి ప్రపంచ దేశాలన్నింటికీ వ్యాపిస్తున్నాయి.

రెండు నెలల క్రితం కేరళ, గుజరాత్ రాష్ట్రాలను వణికించిన నిఫా, చాందీపూర్ వైరస్ లను మరచిపోకముందే, మంకీపాక్స్ రూపంలో మరో అంటువ్యాధి ముంచుకొస్తోందన్న వార్తలు భారతీయుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ముట్టుకుంటే చాలు అంటుకునే ఈ వ్యాధి కరోనాకంటే ప్రమాదకరమైనదనే వదంతులు కూడా ఊపందుకోవడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఆమాటకొస్తే, మంకీపాక్స్ అనేది ఇప్పటికిప్పుడే వెలుగుచూసిన కొత్తరకం వ్యాధేమీ కాదు. దీని మూలాలు 1950 చివరినాళ్లలోనే బయటపడ్డాయి. అప్పట్లో ఆఫ్రికా దేశాల్లోని కొన్ని రకాల కోతి జాతుల్లో ఈ వైరస్ బయటపడటంతో దీనికి మంకీపాక్స్ అనే పేరొచ్చినా, ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనికి ఎంపాక్స్‌గా నామకరణం చేసింది. వెనుకబడిన ఆఫ్రికా దేశాల్లో వెలుగుచూసిన మంకీపాక్స్ వైరస్‌పై అప్పట్లో శాస్త్రవేత్తలు అంతగా దృష్టి సారించకపోవడమే ప్రస్తుత అనర్థాలకు కారణం.

తాజాగా ఈ వ్యాధి మళ్లీ ఆఫ్రికాలోనే బయటపడి 500 మంది ప్రాణాలను కబళించగా, మరో 30 వేలకు పైగా రోగులు దీనిబారిన పడినట్లు తెలుస్తోంది. ఈసారిమాత్రం ఆఫ్రికాకు పరిమితం కాకుండా ఐరోపా, ఆసియా దేశాలకూ ఎంపాక్స్ విస్తరిస్తూ, మానవాళికి సవాల్ విసురుతోంది. వ్యాధిగ్రస్థులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వారి నోటినుంచి లేదా ముక్కునుంచి ఎదుటివారికి వైరస్ వ్యాపించడం కరోనా లక్షణం కాగా, మంకీపాక్స్ మాత్రం కేవలం రోగిని ముట్టుకున్నంతమాత్రాన సోకుతుంది. నోరు, ముక్కు స్రావాల వల్ల కూడా ఇది వ్యాప్తి చెందుతుందని అంటున్నారు.

జ్వరం, ఒంటి నొప్పులు, శరీరంపై పొక్కులు ఏర్పడటం, గొంతు ఎండిపోవడం దీని ప్రధాన లక్షణాలు. వ్యాధి సోకిన 21 రోజుల్లో ఎప్పుడైనా బయటపడే ఈ వ్యాధికి సకాలంలో చికిత్స జరగకపోతే ప్రాణాంతకమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనాలో వివిధ రకాల వేరియంట్లు ఉన్నట్లే, ఎంపాక్స్‌లోనూ రెండు రకాల వేరియంట్లు ఉన్నాయని, వీటిలో క్లాడ్ 1 రకం ప్రమాదకరమైనదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎంపాక్స్ వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడం తాజా పరిణామం. ఈ మహమ్మారి వ్యాధికి ప్రత్యేకమైన మందులేమీ లేవు. విచిత్రమేమంటే ఎంపాక్స్ నివారణకు రెండు రకాల టీకాలు గతంలోనే వినియోగంలోకి వచ్చినా, అనేక దేశాల్లో వీటికి అనుమతులు లేవన్న వార్తలు కలవరం కలిగిస్తున్నాయి.

ప్రస్తుతం వ్యాధి తీవ్రత దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యూహాత్మక సలహా విభాగం ఆదరాబాదరా ఈ టీకాల వినియోగానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ కారణంగా ఎంపాక్స్ టీకాల తయారీ, పంపిణీ వేగం అందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం అనేక దేశాల్లో మశూచికి వాడే వ్యాక్సీన్‌నే వాడుతున్నారు. ఇది ప్రభావవంతంగా పనిచేస్తోందని కితాబు ఇస్తున్న శాస్త్రవేత్తలు, వైద్యులూ లేకపోలేదు. మూడేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన మారణహోమం అంతా ఇంతా కాదు. దీనిబారిన పడి లక్షలాది మంది అసువులు బాయగా, ఇప్పటికీ దీని ప్రభావం ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉంది. అంటువ్యాధులు ప్రబలినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మానవాళికి కరోనా పాఠాలు నేర్పింది. అయినప్పటికీ ఎంపాక్స్ విషయంలో స్వీయజాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.

అదే సమయంలో ఈ మహమ్మారి వ్యాధి గురించి ప్రభుత్వాలు విస్తృత ప్రచారం నిర్వహించి, ప్రజలలో అవగాహన పెంపొందించడం అత్యవసరం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు అన్ని ఆసుపత్రులలోనూ యాంటీ వైరల్ మందులు అందుబాటులో ఉంచడంతోపాటు విమానాశ్రయాలలో ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించడం మంచిది. ముఖ్యంగా ఆఫ్రికా దేశాలనుంచి వచ్చేవారి పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. అవగాహనా కార్యక్రమాలు చేపట్టడం, గ్రామ స్థాయిలోనూ ఆరోగ్య కేంద్రాలను తగిన ఔషధాలు, సిబ్బందితో బలోపేతం చేయడం ద్వారా ఎంపాక్స్‌ను మొగ్గలోనే అరికట్టడం వీలవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News