మనతెలంగాణ/హైదరాబాద్: త్వరలో కేబినేట్ సమావేశం జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఇప్పటికే రుణమాఫీని విజయవంతంగా అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన పథకాలతో పాటు పెట్టుబడులు పెట్టే విదేశీ కంపెనీలకు భూముల కేటాయింపు, ఆయా కంపెనీలకు ఇచ్చే ప్రోత్సాహాకాలపై కూడీ ఈ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. విదేశీ పర్యటన, వాటి ఫలితాలు, రానున్న పెట్టుబడులను మంత్రివర్గం భేటీలో సహచర మంత్రులకు వివరించేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.
రానున్న రోజుల్లో పాలనపై మరింత పట్టుసాధించడంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా వ్యూహాలను రచించేలా సిఎం రేవంత్ నిర్ణయాలను తీసుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో ఆ దిశగా సిఎంఓ ప్రక్షాళనతోపాటు పలు శాఖలకు సమర్ధులైన సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించాలని సిఎం ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. అందు లో భాగంగా ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్‌లను కూడా బదిలీ చేయవచ్చని విద్యుత్, రెవెన్యూ శాఖలతో పాలు పలు శాఖల్లో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.
హైడ్రాకు బాహుబలి వ్యవస్థ
ఇలా ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేపడుతూ ప్రజల వద్దకే పాలనను అందించేలా వ్యూహాలకు రూపొందిస్తున్నట్టుగా తెలిసింది. దీంతోపాటు ముచ్చెర్ల దగ్గర ఏర్పాటుకానున్న ఫోర్త్‌సిటీకి కూడా ప్రత్యేక అధికారిని నియమించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఫోర్త్‌సిటీలో విదేశీ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉండడం, ఆయా కంపెనీలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా స్పెషల్ ఆఫీసర్‌ను సైతం నియమించాలని సిఎం నిర్ణయించినట్టుగా తెలిసింది. దీంతోపాటు హైడ్రాకు బాహుబలి వ్యవస్థకు (కేబినేట్ ఆమోదించాల్సి ఉంది) నలుగురు (4) ఎస్పీలు, 70 స్పెషల్ టీమ్స్ (సిఐ స్థాయి)+ సపోర్టింగ్ స్టాఫ్‌తో అదనంగా కొత్త పోస్టులకు సంబంధించి కేబినెట్‌లో చర్చించి ఆమోదించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.