ఓ పాల ట్యాంకర్ లోయలో పడిన ఘటనలో ఐదుగురు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లా కసర ఘాట్ కొండ సెక్షన్‌లో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాసిక్ జిల్లాలోని సిన్నార్ నుండి ముంబయి వైపు వెళుతున్న పాల ట్యాంకర్ మలుపు వద్ద అదుపుత్పడంతో దాదాపు 200 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని తాళ్లతో గాయపడిన వ్యక్తులను, మృతదేహాలను బయటకు తీశారని థానే పోలీస్ అధికారి చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని ప్రైవేట్ అంబులెన్స్‌లలో ఘోటి గ్రామంలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారి తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.