రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. సోమవారం మంచిర్యాల పర్యటనలో ఆయన తెలంగాణ విద్యా వ్యవస్థ, బీఆర్‌ఎస్ విలీనం, ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ విద్యావ్యవస్థలో నక్సలిజాన్ని జొప్పించే కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్‌ఎస్ విలీనమవుతుందని పునరుద్ఘాటించారు. మ న సంస్కృతి, చరిత్ర మరుగునపడే ప్రమాదముందని హెచ్చరించారు. దేశ పరిణామాలపై అవగాహన లేకుంటే విచ్ఛిన్నమయ్యే ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు. ఇందుకు బంగ్లాదేశ్ సంక్షోభమే నిదర్శనమని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్‌ఎస్ విలీనం కానుందని బండి సంజయ్ పునరుద్ఘాటించారు.
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటే కాకుంటే కెసిఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ కొడుక్కి ఇంకా గర్వం తగ్గలేదని విమర్శించారు. కేసీఆర్ ఆరోగ్యం బాగుపడాలని కోరుకుంటున్నానన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తోందని విమ ర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఇందిరమ్మ ఫొటో పెడితే ఊరుకునేది లేదని, ప్రధాని నరేంద్రమోదీ ఫొటో ఉండాల్సిందేనని అన్నారు. రుణ మాఫీ గురించి మాట్లాడుతూ రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి, వాస్తవానికి పొంతన లేదన్నారు. సోనియాగాంధీ పుట్టిన రోజు రైతులందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి కొందరికే మాఫీ చేశారని ఆరోపించారు.
రూ.40 వేల కోట్లు మాఫీ చేస్తామని చెప్పి రూ.17 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని గుర్తు చేశారు. సోనియా గాంధీనే మోసం చేసిన ఘనులు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.