Thursday, November 14, 2024

పంచాయతీ ఎన్నికలపై నజర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్‌ః తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టిసారించింది. ఓటర్ల తుది జాబితా సెప్టెంబర్ 21న ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఆదేశించారు. గ్రామ పంచాయతీల వారీగా ఓటరు జాబితా తయారీ, ప్రచురణపై అధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్‌ను ఆయన విడుదల చేశారు.

శాసనసభ నియోజకవర్గాల ఓటరు జాబితాల ఆధారంగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో వార్డులు వారీగా ఓటరు జాబితాలు రూపొందించాలని కమిషనర్ పార్థసారథి పేర్కొన్నారు. సెప్టెంబర్ 6న వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా ముసాయిదా ఓటరు జాబితాలను ఆయా జిల్లాల్లో మండల అభివృద్ధి అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు తయారు చేసి గ్రామ పంచాయతీలలో ప్రచురిస్తారు. ఆ ముసాయిదా ఓటరు జాబితాలపై జిల్లా కలెక్టర్లు, మండల అభివృద్ధి అధికారులు సెప్టెంబర్ 9, 10 తేదీలలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా స్థాయి, మండల స్థాయి సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఆ సమావేశంలో వారి సూచనలు, సలహాలు స్వీకరించాలని తెలిపారు.

ముసాయిదా ఓటరు జాబితాలపై సెప్టెంబర్ 7 నుంచి 13 వరకు సంబంధిత జిల్లా పంచాయతీ అధికారులు, మండల అభివృద్ధి అధికారులు ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించి వాటిని సెప్టెంబర్ 19న పరిష్కరించాలని సూచించారు. వార్డుల వారీ, గ్రామ పంచాయతీల వారీగా తుది ఓటరు జాబితాలను సంబంధిత గ్రామ పంచాయతీ, మండల పరిషత్‌లలో సెప్టెంబర్ 21న ప్రకటించి ఆయా కార్యాలయాల్లో ఉంచాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ ఓటరు జాబితాల రూపకల్పన ప్రక్రియపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), జిల్లా పంచాయతీ అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈనెల 29న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News