Monday, December 23, 2024

ఈ అఘాయిత్యాలు ఇంకెన్నాళ్లు?

- Advertisement -
- Advertisement -

రోగుల జీవితాలకు కొత్త చైతన్యం కలిగించే వైద్యులకు తాము పనిచేసే ఆస్పత్రుల్లోనే కనీస సదుపాయాలు కానీ, భద్రత కానీ పూర్తిగా లోపించడం అత్యంత శోచనీయం. దీనికి కోల్‌కతా ఆర్‌జి కార్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి ట్రయినీ వైద్య విద్యార్థిని హత్యాచార సంఘటనే ప్రబల సాక్షం. ఈ కేసును సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టినప్పుడు ఆస్పత్రుల్లోని భద్రత తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉన్న చట్టాలు ఆస్పత్రుల్లోని వైద్యులకు, సిబ్బందికి తగిన భద్రత కల్పించడం లేదని నేషనల్ టాస్క్‌ఫోర్సుని ఏర్పాటు చేసింది. అన్ని ఆస్పత్రుల్లో భద్రతా పరిస్థితులను కల్పించడానికి చేపట్టాల్సిన చర్యలపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

మొదటి రోజు మంగళవారం విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ 1973 నాటి అరుణా షాన్‌బాగ్ కేసును ప్రస్తావించారు.ఆస్పత్రుల్లో పని చేసే వైద్యులు, నర్సులు ఎలాంటి అభద్రతా పరిస్థితుల్లో పని చేస్తున్నారో ఈ కేసు పూర్వాపరాలు తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని కింగ్ ఎడ్వర్డ్ ఆసుపత్రిలో 25 ఏళ్ల అరుణా షాన్‌బాగ్ అనే నర్సుపై 1973 నవంబర్ 27వ తేదీ రాత్రి వార్డుబాయ్ సోహన్ లాల్ పాశవిక దాడికి పాల్పడ్డాడు. అత్యంత కిరాతకంగా జరిగిన ఈ లైంగిక దాడిలో ఆమె మెదడుకు తీవ్ర గాయమై కోమాకు దారి తీసింది. దాదాపు 40 ఏళ్ల పాటు ఆమె మంచానికే పరిమితమై 2015లో న్యూమోనియాతో కన్నుమూసింది. ఈ సంఘటన జరిగి 51 సంవత్సరాలైనా హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్‌కు భద్రత అన్నది ప్రశ్నార్థకంగానే ఉంటోంది తప్ప ఏమాత్రం మెరుగుపడలేదు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వైద్యసిబ్బందిపై హింసాత్మక సంఘటనలు జరుగుతున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. దీన్ని బట్టి అరుణా షాన్‌బాగ్ సంఘటన నుంచి ఏమాత్రం గుణపాఠం నేర్చుకున్నట్టు కనిపించడం లేదు.

ఇటీవల ఉత్తరాఖండ్‌లో ఒక నర్సుపై పాశవికంగా లైంగిక దాడి హత్యాచారానికి దారి తీసింది. బీహార్‌లో వైద్యేతర రంగానికి చెందిన బాలికపై దారుణంగా హత్యాచారం జరిగింది. ఆస్పత్రుల పనితీరు గురించి సాధారణ ప్రజానీకానికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. సీనియర్ ప్రొఫెషనల్స్ తమ డ్యూటీ అవర్స్ పూర్తి కాగానే ఇంటికి వెళ్లిపోతారు. పిజి రెసిడెంట్ డాక్టర్లు వర్చువల్‌గా ఆస్పత్రులను నడుపుతుంటారు. సీనియర్లకు బదులు యువ ట్రయినీ డాక్టర్లే అడ్మిషన్ నుంచి మిగతా అన్ని పనులు చూస్తుంటారు. రెసిడెన్సీ మేన్యువల్ ప్రకారం పిజి రెసిడెంట్ వారానికి 70 గంటలు ఆస్పత్రిలో పని చేయవలసి ఉంటుంది.అంటే రోజుకు 11 నుంచి 12 గంటల వరకు పనిచేయాలి. అయితే అవసరాన్ని బట్టి మరిన్ని పని గంటలు ఎక్కువగా పనిచేయాల్సి వస్తోంది. యువ డాక్టర్లు ఎలాంటి విరామం లేకుండా 36 నుంచి 48 గంటలు పనిచేయక తప్పడం లేదు.

ఈ విషయంలో చాలా ఆస్పత్రుల్లో డాక్టర్లకు కనీసం విశ్రాంతి తీసుకోడానికి కూడా తగిన సదుపాయాలు ఉండడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కోల్‌కతా దురదృష్ట బాధితురాలు రాత్రి పూట విశ్రాంతి కోసం ఎందుకు అభద్రత కలిగిన సెమినార్ హాలును ఆశ్రయించవలసి వచ్చిందో ఇది తెలియజేస్తుంది. పోస్ట్‌మార్టమ్ రిపోర్టులో ఆమె గాఢ నిద్రలో ఉండగా నిందితుడు ఆమెపై దాడి చేసినట్టు బయటపడింది. దీన్నిబట్టి విశ్రాంతి లేని భారం వల్లనే ఆమె గాఢ నిద్రలో మునిగినట్టు తెలుస్తోంది.ఇదిలా ఉండగా పురుష, మహిళా డాక్టర్లకు వేర్వేరు ప్రత్యేక డ్యూటీ రూమ్స్ ఉండడం లేదు. డాక్టర్లకు, వైద్యసిబ్బందికి జాతీయ స్థాయి ప్రొటోకాల్ ఉండాలని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కూడా సూచించారు. కోల్‌కతా సంఘటన జరిగిన వెంటనే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సాధ్యమైనంతవరకు మహిళలకు నైట్ డ్యూటీ పని గంటలు తగ్గించాలని ఆదేశించింది.

అయితే దీనివల్ల భద్రత ఎలా చేకూరుతుంది అన్నది ప్రశ్న. హింస ను నివారించడానికి బదులు ఉద్యోగం నుంచి మహిళలను తొలగించే పరిస్థితికి దారి తీస్తుందన్న విమర్శలు తలెత్తుతున్నాయి. 2012లో ఢిల్లీలో క్రూరమైన అత్యాచార సంఘటన తరువాత ప్రభుత్వం కఠినమైన నిబంధనలతో చట్టాన్ని రూపొందించినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నేషనల్ క్రైమ్ రికార్డ్డ్ బ్యూరో 2022 వార్షిక నివేదిక ప్రకారం మహిళలపై అఘాయిత్యాల కేసులు దాదాపు 4.45 లక్షలు నమోదు అయ్యాయి. అంటే ప్రతి గంటకు 51 ఎఫ్‌ఐఆర్‌లు దాఖలైన దానితో సమానం. 2012 ఢిల్లీ హత్యాచార సంఘటనకు సంబంధించి 2017లో దోషులైన వారిలో నలుగురికి మరణశిక్ష పడినా సమాజంలో పరిస్థితులు మారడం లేదు. కోల్‌కతా వైద్య విద్యార్థిని విషాదాంతంపై కోల్‌కతాతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ‘రీక్లయిమ్ ది నైట్ ’ అనే నినాదంతో ఉద్యమం సాగుతోంది. అంటే ‘ఇంటా బయటా మహిళలకు రాత్రుళ్లు స్వేచ్ఛగా సంచరించే పరిస్థితిని కల్పించాలన్నదే దీని లక్షం. ఇది ప్రభుత్వానికి, సమాజానికి మేల్కొలుపు కావాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News