మనతెలంగాణ/హైదరాబాద్: అర్హులైన రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా బిఆర్‌ఎస్ ఆందోళనలు చేపట్టింది. రుణమాఫీపై సిఎం రేవంత్‌రెడ్డి చేసిన మోసాన్ని ఎండగడుతూ అన్ని మండల కేంద్రాలు, నియోజకవర్గాల్లో నిరసనలు నిర్వహించాలంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపు మేరకు బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎంఎల్‌ఎలు, మాజీ ఎంఎల్‌ఎలు, ఇతర ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులతో కలిసి మండల కేంద్రాలు, నియోజకవర్గాల్లో గురువారం నిరసనలు నిర్వహించారు.
రూ.2 లక్షల రుణమాఫీ జరిగేదాక కాంగ్రెస్‌ను వదిలిపెట్టం : కెటిఆర్
రైతులు అధికారుల వెంబడి కాకుండా కాంగ్రెస్ నేతల వెంట పడాలని కెటిఆర్ అన్నారు. ఓట్లు ఎవరికి వేశామో వాళ్లనే రుణమాఫీ అడుగుదామని పేర్కొన్నారు. ఈ మేరకు సిఎం రేవంత్‌రెడ్డిపై కెటిఆర్ విమర్శలు గుప్పించారు. షరతులు లేకుండా రూ.2 లక్షల వరకు రుణమాఫీ జరిగేదాక కాంగ్రెస్‌ను వదిలిపెట్టమని స్పష్టం చేశారు. చేవెళ్ల మండల కేంద్రంలో నిర్వహించిన రైతు నిరసన దీక్ష కార్యక్రమంలో కెటిఆర్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ సబితా ఇంద్రారెడ్డి, బిఆర్‌ఎస్ నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, రుణమాఫీకి రూ.49 వేల కోట్లు కావాలని సిఎం రేవంత్ చెప్పారని గుర్తు చేశారు. మంత్రివర్గ భేటీలో రుణమాఫీకి రూ.31 వేల కోట్లు కావాలన్నారని, అసెంబ్లీ బడ్జెట్‌లో రుణమాఫీకి రూ.26 వేల కోట్లు మాత్రమే కేటాయించారని దుయ్యబట్టారు. నిండు శాసనసభలో సిఎం సబితక్కను అవమానించారని అన్నారు. అక్కలను నమ్ముకుంటే నీ బ్రతుకు జూబ్లీ బస్టాండ్ అవుతుందని సబితమ్మను టార్గెట్ చేశారని పేర్కొన్నారు.
ప్రజలను రక్షించమని కోరుకున్నా : హరీశ్‌రావు
రుణమాఫీ విషయంలో దేవుళ్లను కూడా సిఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఏ దేవుళ్లపై ఒట్లు పెట్టారో ఆయా ఆలయాలకు వెళ్లి పాప ప్రాయశ్చిత్తం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తానని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టు పెట్టి సిఎం రేవంత్‌రెడ్డి మాట తప్పారని ఆరోపించారు. గురువారం హరీశ్‌రావు యాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని హరీశ్ రావు దర్శించుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పాలకుడు పాపం చేస్తే ప్రజలకు అరిష్టం అని బ్రాహ్మణ ఉత్తములు చెప్పారని, ప్రజలకు అరిష్టం కలగకుండా పాపం చేసిన సిఎంను క్షమించమని, ప్రజలను రక్షించమని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని వేడుకున్నానని తెలిపారు. రైతులందరికీ రుణమాఫీ, పంటల బోనస్ ఇచ్చేంత వరుకు పోరాడే శక్తిని ఇవ్వాలని వేడుకున్నాని అన్నారు. అనంతరం హరీశ్‌రావు ఆలేరు, జనగామలో నిర్వహించిన రైతు ధర్నాలో పాల్గొని మాట్లాడారు.