Friday, November 22, 2024

బయట కాపలాగా ఎవరు ఉన్నారు?: డాక్టర్ హత్యాచార కేసులో సిబిఐ ఆరా

- Advertisement -
- Advertisement -

కోల్‌కత: ఆర్‌జి కార్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో పోస్టు గ్రాడ్యుయేట్ ట్రెయినీ డాక్టర్ హత్యాచార కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ ఈ దారుణం వెనుక ఒకరికన్నా ఎక్కువ మంది నిందితులు ఉండే అవకాశం ఉందని అనుమానిస్తోంది. ట్రెయినీ డాక్టర్ హత్యాచారం జరిగిన వైద్య కళాశాల ప్రాంగణంలోని సెమినార్ హాలులోని లుపుకు గొళ్లెం విరిగిపోయి ఉండడంతో సిబిఐ అనుమానాలకు బలం చేకూరుతోంది. గొళ్లెం విరిగిపోయిన హాలులో ఎటువంటి ఆటంకం లేకుండా నేరం ఎలా జరిగి ఉండవచ్చన్న కోణంపై సిబిఐ దృష్టి సారించింది.

లోపల నేరం జరుగుతున్న సమయంలో హాలు బయట ఎవరైనా కాపలాగా ఉన్నారా అన్న విషయాన్ని కనుగొనేందుకు సిబిఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ట్రెయినీ డాక్టర్ చిత్రహింసలకు గురవుతున్నప్పటికీ సెమినార్ హాలు వెలుపలకు ఆర్తనాదాలు ఏవీ ఎందుకు వినపడలేదని సిబిఐ అధికారులు విస్మయం చెందుతున్నారు. తలుపు పైన బోల్టు విరిగిపోయిందని, దాంతో తలుపును మూయడం సాధ్యం కాదని సిబిఐ అధికారి ఒకరు తెలిపారు.

నేరం జరుగుతున్న సమయంలో ఇతరులు ఎవరూ లోపలకు రాకుండా బయట ఎవరైనా కాపలాగా ఉన్నారా అన్న విషయంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఆగస్టు 9వ తేదీ తెల్లవారుజామున 2, 3 గంటల మధ్య ట్రెయినీ డాక్టర్ సెనేట్ హాలులోకి వచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఆయన చెప్పారు. ఆమె లోపల నిద్రిస్తుండగా మరో డ్యూటీ డాక్టర్ చూశారని కూడా అధికారి తెలిపారు. చాలా రోజులుగా తలుపు పనిచేయడం లేదన్న విషయం అక్కడి డాక్టర్లందరికీ తెలుసునని డాక్టర్లు, ఇంటర్నీలు, జూనియర్ డాక్టర్లను ప్రశ్నించినపుడు వెల్లడైందని ఆ అధికారి తెలిపారు. ఈ కారణంగా బాధితురాలు ఆ రాత్రి తలుపులు మూసి నిద్రించలేదని తేలుతోందని ఆయన చెప్పారు.

ఇలా ఉండగా ఈ కేసుకు సంబంధించి ఆర్‌జి కార్ వైద్య కళాశాల, ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను సిబిఐ ప్రశ్నించడం శుక్రవారం కూడా కొనసాగింది. ఆయనకు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించడానికి సిబిఐ అధికారులు సమాయత్తం అవుతున్నారు. కాగా..నిందితుడు సంజయ్ రాయ్‌ను శుక్రవారం సిబిఐ కోర్టులో హాజరుపరచగా అతడికి 14 రోజుల జైలు కస్టడీని కోర్టు విధించింది. ఇదిలా ఉండగా ఆర్‌జి కార్ ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తును సిట్ నుంచి సిబిఐకి అప్పగిస్తూ కలకత్తా హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News