కోల్‌కతాలోని ఆర్‌జి కర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ ప్రిన్సిపాల్‌గా ఉన్న సమయంలో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించి ఆయన ఇంటిలో సిబిఐ ఆదివారం సోదాలు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. నిందితుడు, వారి సహచరుల ఇళ్లతో సహా 14 ఇతర ప్రదేశాల్లో కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు సాగిస్తున్నదని వారు తెలిపారు. ఈ నెల 9న కళాశాల, ఆసుపత్రి సెమినార్ హాల్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటనతో వైద్య కళాశాల మీడియా దృష్టిని ఆకర్షించింది. ఆ ఘటన సందర్భంగా ఒక ట్రాఫిక్ పోలీస్ వాలంటీర్ సంజయ్ రాయ్‌ను అరెస్టు చేసిన విషయం విదితమే. ఆ కిరాతక ఘటన దేశవ్యాప్తంగా వైద్యులు, పౌరుల పరంగా నిరసన ప్రదర్శనలకు దారి తీసింది. కలకత్తా హైకోర్టు ఆదేశాలపై సిబిఐ హత్య, ఆర్థిక అవకతవకలపై కేసులు నమోదు చేసింది.
ఆర్‌జి కర్ ఆసుపత్రిలో గతంలో పని చేసిన డిప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. ఆ కేసును కూడా కోర్టు సిబిఐకి బదలీ చేసింది. మూడు వారాల్లోగా దర్యాప్తు స్టేటస్ నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సందీప్ ఘోష్‌కు, మరి నలుగురికి శనివారం నిజ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందు కోసం ఢిల్లీలోని ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ నుంచి ప్రత్యేక బృందాలు వచ్చాయి. ఇది ఇలా ఉండగా, ఆర్‌జి కర్ వైద్య కళాశాల, ఆసుపత్రి సమీపంలో నిషేధాజ్ఞలను ఈ నెల 31 వరకు కోల్‌కతా పోలీసులు పొడిగించారు. ఆ ప్రాంతంలో శాంతి భద్రతల పరిస్థితి పరిరక్షణ కోసం నిషేధాజ్ఞలను పొడిగించినట్లు నగర పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ తెలిపారు.