Tuesday, January 21, 2025

పెద్దల అక్రమ కట్టడాలు కూలిస్తే మంచిదే.. కానీ పేదల జోలికెళ్లొద్దు:ఈటల

- Advertisement -
- Advertisement -

అక్రమ నిర్మాణాలు చేపట్టిన పెద్దల ఇళ్లను కూల్చివేస్తే ఫర్వా లేదని, పేదల ఇళ్ల జోలికి వెళ్లవద్దని మల్కాజ్‌గిరి బిజెపి ఎంపి ఈటల రాజేందర్ హైడ్రా అధికారులను హెచ్చరించారు. హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) కూల్చివేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెద్ద పెద్ద వాళ్ల అక్రమ నిర్మాణాలను పక్కనబెట్టి సామాన్యులు, మధ్యతరగతి ప్రజలను భయపెడుతున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి నాలుగు రోజులుగా ఆయన్ను ఆయనే హీరో అనుకొని హైడ్రామా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అయ్యప్ప సొసైటీలో కూల్చివేతలు చేసి కేసీఆర్ ఫొటోలకు ఫోజులిచ్చారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఫోజులు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. నిజంగానే అవి అక్రమ నిర్మాణాలతై మరి అనుమతులు ఇచ్చిన కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్లు. సంబంధిత అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఈటల ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీకి వందేళ్ల చరిత్ర ఉందని, రేవంత్ రెడ్డి వచ్చాక కాంగ్రెస్ పుట్టలేదని స్పష్టం చేశారు. 30, 40 ఏళ్ల కిందట కాంగ్రెస్ పాలనలో ఇక్కడ చెరువుల్లో ఎఫ్ టీఎల్ భూముల్లో ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చారని, ఇళ్లు కట్టించారని, లే అవుట్లకు అనుమతులు ఇచ్చారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. అటువంటి పట్టా భూముల్లోని ఇళ్లను, లే అవుట్లను తొలగిస్తామంటూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. తమ ఇళ్లు కూల్చివేస్తారేమోనని సాహెబ్ నగర్, ఫాక్స్ సాగర్ ప్రజలు భయపడుతున్నారని వివరించారు. ప్రజల సమస్యలు పరిష్కరించే దమ్ము లేక, వాటిపై చర్చించే ధైర్యం లేక ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. బతుకమ్మ కుంట ఎవరు పూడ్చారు? ప్రభుత్వమే పూడ్చివేసిదని, కరీంనగర్ లో చెరువులను కూడా ప్రభుత్వమే పూడ్చేసిందని అన్నారు. ఇలా ప్రభుత్వం పూడ్చేసిన చెరువులు ఎన్ని అనేది లెక్క తేలాలని కోరారు. ఎఫ్ టీఎల్ భూముల్లో పట్టాలు ఇవ్వడంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతేతప్ప, రాత్రిపూట దొంగల్లాగా వెళ్లి మిషన్లతో సామాన్యుల ఇళ్లు కూలగొట్టే పద్ధతి మంచిది కాదని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News