Saturday, January 4, 2025

ముఖ్యమంత్రి షిండే రాజీనామా చేయాలి: ఎంపి సంజయ్ రౌత్

- Advertisement -
- Advertisement -

ముంబై: సింధూదుర్గ్ జిల్లాలో 35 అడుగుల ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం కూలిపోవడానికి బాధ్యత వహిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే రాజీనామా చేయాలని శివసేన(యుబిటి) నాయకుడు, రాజ్యసభసభ్యుడు సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. శివాజీ విగ్రహ నిర్మాణంలో అవినీతి కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. శివాజీ మహరాజ్‌కు ఇంతటి అవమానం ఔరంగజేబు, ముఘలుల పాలనలో కూడా జరగలేదని రౌత్ విమర్శించారు.

గత ఏడాది డిసెంబర్ 4న నౌకాదళ దినోత్సవం నాడు సింధూదుర్గ జిల్లా మల్వాన్ తహసిల్‌లోని రాజ్‌కోట్ కోటలో 17వ శతాబ్దానికి చెందిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించగా సోమవారం ఆ విగ్రహం కూలిపోయింది. మంగళవారం నాడిక్కడ విలేకరులతో సంజయ్ రౌత్ మాట్లాడుతూ శివాజీ విగ్రహం కూలిపోవడానికి ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ బాధ్యత వహించాలని డిమాండు చేశారు.

రాజకీయ లబ్ధి కోసమే శివాజీ విగ్రహాన్ని వారు ప్రతిష్టించారని ఆయన ఆరోపించారు. మహారాష్ట్ర ప్రజల మనోభావాలను గాయపరిచినందుకు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని, ప్రజా పనుల శాఖ మంత్రి రవీంద్ర చవాన్‌ను బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండు చేశారు. శివాజీ మహరాజ్‌ను కూడా విడిచిపెట్టకుండా అవినీతికి పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. ఈ విగ్రహాన్ని తయారు చేసిన కాంట్రాక్టర్ ముఖ్యమంత్రి షిండేకు అత్యంత సన్నిహితుడని ఆయన ఆరోపించారు. ఈ ఘటనను మహా వికాస్ అఘాడి(ఎంవిఎ) తేలికగా వదిలిపెట్టబోదని ఆయన హెచ్చరించారు.

గంటకు 45 కిలోమీటర్ల వేగంగా గాలులు వీచడం వల్లనే శివాజీ విగ్రహం కూలిపోయిందన్న ముఖ్యమంత్రి షిండే ప్రకటనను ఆయన ప్రస్తావిస్తూ సముద్ర తీరంలో గాలులు బలంగానే వీస్తాయని ఎద్దేవా చేశారు. ముంబైలోని గిర్గావ్ చౌపాటిలో సంఘ సంస్కర్త లోకమాన్య తిలక్ విగ్రహాన్ని 1933లో ఏర్పాటు చేశారని, అది ఇప్పటికీ చెక్కు చెదరలేదని, ప్రతాప్‌గఢ్ కోట వద్ద శివాజీ మహరాజ్ విగ్రహాన్ని 1956లో అప్పటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ప్రతిష్టించారని, అది కూడా చెక్కు చెదరలేదని రౌత్ తెలిపారు. శివాజీ మహరాజ్ విగ్రహం కూలిపోయిన ఘటనపై సింధూదుర్గ్ జిల్లా పోలీసులు విగ్రహం తయారుచేసిన కాంట్రాక్టర్‌పైన, స్ట్రక్చరల్ కన్సల్టెంట్‌పైన కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News