Sunday, November 24, 2024

ఫోన్ మారిస్తే నేరం చేసినట్లా?: ఇడి, సిబిఐలపై సుప్రీం సీరియస్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దర్యాప్తు సంస్థల పనితీరుపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులపై విచారణ చేస్తోన్న సిబిఐ, ఇడి తీరును ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం, ఎవరినైనా ఎంపిక చేసుకొని నిందితులుగా పేర్కొంటారా? అని నిలదీసింది.

కేంద్ర దర్యాప్తు సంస్థల నిష్పక్షపాత వైఖరిపై అనుమానాలు వ్యక్తం చేసింది. కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం సిబిఐ, ఇడి తీరును ఎండగట్టింది. కేవలం అప్రూవర్లుగా మారిన మాజీ నిందితుల వాంగ్మూలాలపైనే ఆధారపడలేరని, దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సాక్షిగా మారారా? అని ప్రశ్నించిన ధర్మాసనం, ఎంపిక చేసుకున్నంత మాత్రాన వారిని నిందితులుగా చూస్తారా అంటూ మండిపడింది. ఇందులో న్యాయమెక్కడా? అని నిలదీసింది.

ఈ క్రమంలోనే మద్యం కుంభకోణంలో కవిత పాత్ర ఉందని చెప్పేందుకు మీ వద్ద ఉన్న ఆధారాలేంటని కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రశ్నించింది. ధర్మాసనం ప్రశ్నలకు దర్యాప్తు సంస్థల తరఫున అడిషినల్ సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు బదులిచ్చారు. సాక్షులుగా మారిన బుచ్చిబాబు, మాగుంట రాఘవ రెడ్డిలు ఇచ్చిన ఆధారాలను ప్రస్తావించారు. కవిత తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి జోక్యం చేసుకుంటూ ’ఈ వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలాల్లోనే అనేక అంశాలను ఇతర (కేజ్రీవాల్) కేసుల్లో ఆధారాలుగా చూపించారని గుర్తు చేశారు. ’కేజ్రీవాల్ సూత్రధారి, మనీశ్ సిసోదియా సూత్రధారి, ఇప్పుడు కవిత సూత్రధారి అని చెబుతున్నారు. అప్రూవర్లుగా మారిన వాళ్లు ఇచ్చిన స్టేట్‌మెంట్లు మినహా ఎటువంటి ఆధారాలు లేవు’ అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

మెసేజ్‌లు డిలీట్ చేస్తే తప్పేంటి:

ఈ క్రమంలో జోక్యం చేసుకున్న సుప్రీం ధర్మాసనం అప్రూవర్ల వాంగ్మూలాలను వేరుగా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ నేరంలో కవిత పాత్ర ఉందని నిరూపించడానికి ఆధారాలు ఏవని ప్రశ్నించింది. అంతేకాకుండా మొబైల్ ఫోన్‌లను ఫార్మాట్ చేసి అందులోని మెసేజ్‌లను కవిత తొలగించారని పిటిషనర్ చేసిన వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఫోన్లు అనేవి వ్యక్తిగత అంశానికి సంబంధించినవని, ఫోన్లలో మెసేజ్‌లు అందరూ డిలీట్ చేస్తుంటారని పేర్కొంది. స్కూళ్లు, కాలేజీ గ్రూపుల్లో వచ్చే మెసేజ్‌లను తానూ డిలీట్ చేస్తుంటానని జస్టిస్ విశ్వనాథన్ వ్యాఖ్యానించారు. ఇది సాధారణంగా అందరూ చేసే ప్రక్రియే అని, ఇక్కడున్న వాళ్లంతా ఇదే చేస్తుంటారని తెలిపారు. కేవలం ఫోన్ ఫార్మాట్ చేసినంత మాత్రాన నేరం చేసినట్లు భావించకూడదని సూచించారు. నేర నిరూపణకు అదనపు సమాచారం ఉండాలని, లేదంటే కేవలం ఇది ఫోన్‌ను ఫార్మాట్ చేయడం కిందికే వస్తుందని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News