మనతెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభకు అభిషేక్ సింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ నుంచి రెండు నామినేషన్లు రాగా స్వతంత్ర అభ్యర్థిని ఎమ్మెల్యేలు బలపరచకపోవడంతో నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో అభిషేక్ మను సింఘ్వీ ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజ్యసభ అభ్యర్థిత్వానికి రెండు నామినేషన్లు దాఖలు అయ్యాయి. వీటిలో కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్ వేయగా, రెండోది స్వతంత్ర అభ్యర్థిగా పద్మరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేలు బలపరచకపోవడంతో పద్మరాజన్ నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. అభిషేక్ మను సింఘ్వీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఎన్నికల అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్‌లో అభిషేక్ సింఘ్వీ ప్రస్థానం ఇలా…
అభిషేక్ సింఘ్వీ సుధీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్నారు. 2001 నుంచి ఆయన కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధిగా పని చేస్తున్నారు. ఆయన రెండు దఫాలు రాజ్యసభ సభ్యుడి పనిచేశారు. 2006, 2018లో రెండుసార్లు రాజ్యసభ హోదాను ఆయన పొందారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్ నుంచి పోటీ చేసిన ఆయన బిజెపి చేతిలో ఓటమి పాలయ్యారు.
ఈ క్రమంలో ఆయన్ను తెలంగాణ నుంచి పోటీ చేయించాలని ఏఐసిసి నిర్ణయించింది. కానీ, తెలంగాణలో రాజ్యసభ సీటు కోసం స్థానిక నాయకులు కొందరు ప్రయత్నించారు. కానీ, జాతీయ రాజకీయాల్లో సింఘ్వీ సేవలు కాంగ్రెస్‌కు కీలకం కావడంతో ఆయనకు అధిష్టానం ఈ అవకాశం ఇచ్చింది. ఇప్పుడు ఆయన రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణకు చెందిన కే.కేశవరావు రాజీనామాతో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. సెప్టెంబర్ 3వ తేదీన ఈ ఎన్నిక జరగాల్సి ఉంది.
అయితే ప్రతిపక్షాల నుంచి ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ప్రతిపక్ష పార్టీలకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో అభ్యర్థిని ప్రకటించలేదు. దేశ వ్యాప్తంగా రాజ్యసభలో ఖాళీ అయిన మొత్తం 12 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా అస్సాం, బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు.