కేంద్ర హోంశాఖ నిర్ణయం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమానంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ భద్రతను అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్(ఎఎస్‌ఎల్) మోదాకు పెంచుతూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. భగవత్‌కు ఇదివరకు కల్పించిన భద్రతలో లోపాలు ఉన్నాయని, ముఖ్యంగా బిజెపియేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఆయన భద్రతకు ముప్పు ఉందని నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఆయన భద్రతను పెంచినట్లు వర్గాలు తెలిపాయి.
ఇదివరకు ఆయన జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీని ప్రభుత్వం కల్పించింది. ఆయన భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సిఐఎస్‌ఎఫ్) పర్యవేక్షిస్తుంది. భారత వ్యతిరేక, ఇస్లామిక తీవ్రవాద గ్రూపుల నుంచి భగవత్ ముప్పును ఎదుర్కొంటున్నట్లు భావిస్తున్న ప్రభుత్వం ఆయనకు భద్రతను పెంచాలని ఈ నెల మొదట్లో నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రొటోకాల్ ప్రకారం భగవత్ భద్రతలో జిల్లా యంత్రాంగాలు, పోలీసులు, ఆరోగ్య శాఖలు కీలక పాత్రను పోషిస్తాయి.