Wednesday, January 15, 2025

వచ్చే నెల న్యూయార్క్‌లో మెగా కమ్యూనిటీ సభకు ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

24 వేల మందికి పైగా భారతీయులు హాజరుకు సిద్ధం
సభా స్థలిలో 15 వేల మందికే చోటు
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొన్ని వారాల ముందు సభ

న్యూయార్క్ : ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెల న్యూయార్క్‌లో ప్రసంగించనున్న మెగా కమ్యూనిటీ సభకు హాజరు కోసం 24 వేల మందికి పైగా భారతీయ సమాజ సభ్యులు సంతకాలు చేశారు. ‘మోడీ, యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్’ (మోడీ, యుఎస్ కలసి పురోగమించడం) సభను నసావు వెటరన్స్ మెమోరియల్ కొలీజియంలో సెప్టెంబర్ 22న నిర్వహించనున్నారు. అయితే, సభా స్థలిలో 15 వేల మందికి మాత్రమే చోటు ఉంటుంది. మోడీ ప్రసంగించనున్న మెగా సభకు హాజరయ్యేందుకు 24 వేల మందికి పైగా భారతీయ అమెరికన్లు సంతకం చేశారని యుఎస్‌ఎ భారతీయ అమెరికన్ సమాజం(ఐఎసియు) మంగళవారం వెల్లడించింది. ఐక్యరాజ్య సమితి (యుఎన్) జారీ చేసిన వక్తల తాత్కాలిక జాబితా ప్రకారం ప్రధాని మోడీ సెప్టెంబర్ 22న న్యూయార్క్‌లో ఉన్నత స్థాయి యుఎన్ జనరల్ అసెంబ్లీ సెషన్‌లో ప్రసంగించవలసి ఉన్నది.

లాంగ్ ఐలాండ్‌లోని యూనియన్‌డేల్‌లో సభ కోసం రిజిస్ట్రేషన్లు 590 భారతీయ సమాజ సంస్థల ద్వారా వచ్చాయని, అమెరికా వ్యాప్తంగా వారంతా ‘స్వాగత భాగస్వాములు’గా సంతకం చేశారని ఐఎసియు ఒక ప్రకటనలో తెలియజేసింది. కనీసం 42 రాష్ట్రాల నుంచి భారతీయ అమెరికన్లు సభకు హాజరు కావచ్చునని, స్పందన ముఖ్యంగా మూడు రాష్ట్రాల ప్రాంతం నుంచి అధికంగా ఉందని ఐసిఎయు తెలిపింది. ‘ఈ చరిత్రాత్మక సభలో సాధ్యమైనంత ఎక్కువ మంది పాల్గొనగలిగేలా చూడాలని సంకల్పించాం’ అని సభ కీలక నిర్వాహకుడు ఒకరు తెలిపారు. యూదులు, జోరాస్ట్రియన్, జైన్, క్రిస్టియన్, సిక్కు, ముస్లిం, హిందు సమాజాల సభ్యులతో సహా విస్తృత శ్రేణి మత వర్గాలు కూడా భాగస్వామ్య సంస్థలు, హాజరయ్యేవారిలో ఉన్నట్లు ఐసిఎయు తెలియజేసింది. వారు హిందీ, తెలుగు, పంజాబీ, తమిళం, బెంగాలీ, మలయాళం, గుజరాతీ సహా విభిన్న భారతీయ భాషలకు ప్రాతినిధ్యం వహిస్తారని సంస్థ తెలిపింది.

ప్రధాని మోడీ ప్రసంగంతో పాటు వాణిజ్య, విజ్ఞానశాస్త్ర. వినోద, కళల రంగాల్లోని ప్రముఖ భారతీయ అమెరికన్ల సాంస్కృతిక ప్రదర్శనలు కూడా సభలో చోటు చేసుకుంటాయి. 2014 సెప్టెంబర్‌లో న్యూయార్క్‌లోని సుప్రసిద్ధ మాడిసన్ స్కేర్ గార్డెన్‌లో భారీ స్థాయిలో సభికులను ఉద్దేశించి మోడీ ప్రసంగించిన పది సంవత్సరాల తరువాత లాంగ్ ఐలాండ్‌లో జరగనున్న ఈ సభ కోసం సన్నాహకాలు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని ఈ నెలారంభంలో సంస్థ వర్గాలు ‘పిటిఐ’తో చెప్పాయి. నవంబర్‌లో యుఎస్ అధ్యక్ష ఎన్నికలు జరగడానికి కొన్ని వారాల ముందు ప్రధాని మోడీ పర్యటన చోటు చేసుకుంటున్నది. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక్ అభ్యర్థి, నల్లజాతి, భారత సంతతి తొలి మహిళ కమలా హారిస్ పోటీ పడుతున్న విషయం విదితమే.

ఈ ఏడాది యుఎన్ జనరల్ అసెంబ్లీ 79వ సెషన్‌లో ఉన్నత స్థాయి సార్వత్రిక చర్చ సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు జరగనున్నది. యుఎన్ జారీ చేసిన సార్వత్రిక చర్చకు వక్తల తాత్కాలిక జాబితా ప్రకారం, భారత ప్రభుత్వాధినేత 26 మధ్యాహ్నం సెషన్‌లో ప్రసంగించవలసి ఉన్నది. మోడీ రికార్డు స్థాయిలో మూడవ విడత జూన్‌లో భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన విషయం విదితమే. మోడీ చివరిసారిగా 2021 సెప్టెంబర్‌లో వార్షిక ఉన్నత స్థాయి యుఎన్‌జిఎ సెషన్‌లో ప్రసంగించారు. యుఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ సార్వత్రిక చర్చ ప్రారంభానికి ముందు తన నివేదిక సమర్పిస్తారు. ఆతరువాత సమితి అధ్యక్షుడు జనరల్ అసెంబ్లీ 79వ సెషన్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News