Saturday, November 23, 2024

నిబంధనల ప్రకారం లేకుంటే నా ఇంటిని కూల్చేయండి:తిరుపతి రెడ్డి

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ నాయకులు తనను లక్ష్యంగా చేసుకొని దుర్గం చెరువు అమర్ సొసైటీలోని నివాసం ఉండే వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఆరోపించారు. తన నివాసం బఫర్ జోన్‌లో ఉందని నోటీసులు అందాయని, నిబంధనల ప్రకారం లేకుంటే తన ఇంటిని కూల్చేయాలని ఆయన స్పష్టం చేశారు. అమర్ సొసైటీ దుర్గం చెరువు ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లో ఉందంటూ రెవెన్యూ శాఖ జారీ చేసిన నోటీసులపై సిఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. బిఆర్‌ఎస్ నాయకులు తనను లక్ష్యంగా చేసుకొని అమర్ సొసైటీలోని నివాసితులను ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తన వల్ల అమర్ సొసైటీలోని ప్రజలకు ఇబ్బందిగా ఉంటే, ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతానని తిరుపతి రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తాను 2015లో అమర్ సొసైటీలో ఇంటిని కొనుగోలు చేశానని తిరుపతి రెడ్డి పేర్కొన్నారు. అప్పుడు తన ఇల్లు బఫర్ జోన్‌లో ఉందని చెప్పలేదన్నారు.

ఇప్పుడు బఫర్ జోన్‌లో ఉందని నోటీసులు అందాయని నిబంధనల ప్రకారం లేకుంటే తన ఇంటిని కూల్చివేయవచ్చని ఆయన అన్నారు. అధికారులు సమయం ఇస్తే ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోతానన్నారు. అలాగే ముఖ్యమంత్రి ప్రజల కోసమే మంచి పని చేస్తున్నారని, ఆ పనులకు తప్పకుండా తన సహకారం ఉంటుందన్నారు. నెక్టార్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ కో ఆపరేటివ్ సొసైటీ, కావూరి హిల్స్‌లోని నివాసాలకు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. మొత్తం 204 మందికి నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఇల్లు అన్ని పెద్ద పెద్ద బంగ్లాలు, లగ్జరీ విల్లాలు, లగ్జరీ అపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. దుర్గం చెరువు చుట్టూ ప్రముఖుల నివాసాలే ఉన్నాయి. ఒక్కొక్కరూ వందల కోట్ల రూపాయలతో ఈ ఇళ్లను నిర్మించుకున్నారు. నోటీసులు అందుకున్న 204 ఇళ్లు దుర్గం చెరువు ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News