అత్యాచారం, హత్య వంటి కిరాతక నేరాలపై కేంద్రం కఠినాత్మక చట్టం తీసుకురావడం, మరణ శిక్ష విధించడం చేయాలన్న తన అభ్యర్థనను పునరుద్ఘాటిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీకి మరొక లేఖ రాశారు. ఈ నెల 9న కోల్‌కతాలోని ఆర్‌జి కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఒక డాక్టర్‌పై హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా అలజడి రేగిన అనంతరం మమతా బెనర్జీ కొన్ని రోజుల క్రితం మోడీకి లేఖ రాశారు. అత్యాచారం, హత్యాచారం కేసులను నిర్దిష్ట వ్యవధిలో పరిష్కరించడానికి చట్టబద్ధమైన నిబంధన రూపొందించాలని ఆమె ఆ లేఖలో కోరారు.
దోషులుగా నిర్ధారితులైన అత్యాచార నిందితులకు మరణ శిక్ష విధించేలా చూసేందుకు ప్రస్తుత చట్టాలకు ఒక సవరణను వచ్చే వారం రాష్ట్ర శాసనసభలో ఆమోదించనున్నట్లు మమత బుధవారం వెల్లడించారు. తాను రాసిన లేఖకు ప్రధాని నుంచి తనకు ఇంకా సమాధానం అందలేదని మమత వెల్లడిస్తూ, తనకు కేంద్ర మహిళా,శిశు వికాస శాఖ మంత్రి నుంచి ఒక లేఖ అందిందని తెలియజేశారు. తాను లేవదీసిన ‘అంశం తీవ్రత ప్రస్తావన మాత్రమే’ మహిళా శిశు వికాస శాఖ మంత్రి లేఖలో ఉందని మమత తెలిపారు, ‘ఆ అంశం తీవ్రతను, సమాజంపై దాని ప్రభావాన్ని తగు విధంగా గుర్తించలేదు’ అని మమత పేర్కొన్నారు.