Monday, December 23, 2024

వెండితెరకు వేధింపుల చెద

- Advertisement -
- Advertisement -

మలయాళ సినీ పరిశ్రమను కుదిపేస్తున్న మీటూ ఉద్యమం ఇప్పుడు దక్షిణాదిలోని ఇతర చిత్ర పరిశ్రమలలో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. మహిళా నటులపై లైంగిక వేధింపులకు సంబంధించి జస్టిస్ హేమ కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక వెలుగుచూసిన దరిమిలా పలువురు మహిళా నటులు చేసిన ఆరోపణలను పరుస్కరించుకుని ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, నటులపై పోలీసు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ బహుభాషా నటి, బిజెపి నాయకురాలు రాధికా శరత్ కుమార్ ఒక ప్రైవేట్ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో సంచలన విషయాలు బయటపెట్టారు. షూటింగ్ సెట్స్ వద్ద నటుల కోసం ఉంచే కారవాన్‌లలో రహస్య కెమెరాలు అమర్చి మహిళా నటులు దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలను చిత్రీకరిస్తున్నారంటూ రాధిక వెల్లడించారు. ఒక షూటింగ్ సందర్భంగా ఈ విషయం తనకు తెలిసిందని ఆమె చెప్పారు.

తాను కారవాన్‌లో దుస్తులు మార్చుకుని సెట్స్‌లోకి వెళుతుండగా కొందరు వ్యక్తులు సెల్‌ఫోన్‌లో ఏదో చూస్తూ నవ్వుకోవడం కనిపించిందని, వాళ్లేం చూస్తున్నారని ఒక స్పాట్ బాయ్‌ని అడిగితే కారవాన్‌లో మహిళా నటుల డ్రెస్ చేంజ్ వీడియోను చూస్తున్నారని అతను చెప్పాడని ఆమె తెలిపారు. తాను వెంటనే చిత్ర నిర్మాత, దర్శకుడిని గట్టిగా హెచ్చరించానని, ఆతర్వా నుంచి కారవాన్‌లోకి వెళ్లాలంటేనే ఇబ్బందిగా అనిపించేదని, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి తన హోటల్ రూముకు వెళ్లేదాన్నని రాధిక వివరించారు. తమ హోటల్ రూము తలుపును రాత్రి పూట ఎలా తట్టేవారో కొందరు మలయాళ నటీమణులు తన దృష్టికి తెచ్చారని, కొందరైతే తన సహాయాన్ని కూడా కోరారని రాధిక తెలిపారు. కారాన్‌లో దుస్తులు మార్చుకునే నటీమణుల వీడియోలను కొందరు తమ సెల్ ఫోన్లలో సెపరేట్ ఫోల్డర్లలో ఆ నటీమణులు పేర్లతో సేవ్ చేసుకుంటున్నట్లు కూడా ఆమె వెల్లడించారు.

ఇదిలా ఉండగా..తమిళ చిత్ర పరిశ్రమలో ఇటువంటి అనుభవాలు ఏ నటికైనా ఎదురైతే బయటపెట్టాలని సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విశాల్ పిలుపునిచ్చారు. దీనిపై స్పందించిన జాతీయ అవార్డు గ్రహీత, నటి కుట్టి పద్మిని తాను పదేళ్ల వయసులో తమిళ చిత్ర పరిశ్రమలో ప్రవేశించినపుడు తనపై లైంగిక దాడి జరిగిందని, దీనిపై తన తల్లి నిలదీయగా తమ ఇద్దరినీ సెట్ నుంచి బయటకు తరిమేశారని తెలిపారు. కాగా..మలయాళ చిత్ర పరిశ్రమలో మీటూ ఉద్యమం పుంజుకోవడంతో ప్రముఖ నటుటు ముకేష్(సిపిఎం ఎమ్మెల్యే), సిద్దిఖ్, జయసూర్య, సుధీశ్, ఎడవెల బాబు, మనియన్‌పిల్ల రాజుపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా.. ప్రముఖ మలయాళ దర్శకుడు రంజిత్‌పై మరో కేసు నమోదైంది. తనపై లైంగిక దాడి జరిగినట్లు తాజాగా ఒక యువనటుడు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు రంజిత్‌పై రెండవ కేసు నమోదు చేశారు.

ఆడిషన్ పేరిట రంజిత్ 2012లో తనను బెంగళూరులోని ఒక హోటల్‌కు పిలిపించి తన చేత బలవంతంగా దుస్తులు తీయించి దాడి చేశాడని ఆ యువ నటుడు ఆరోపించారు. ఇదంతా ఆడిషన్ ప్రక్రియలో భాగమని చెప్పాడని, మరుసటి రోజు రంజిత్ తనకు డబ్బు కూడా ఇవ్వచూపాడని ఆ నటుడు ఆరోపించారు. దీంతో కోచ్చి పోలీసులు రంజిత్‌పై రెండవ కేసు నమోదు చేశారు. అంతకుముందు ఒక బెంగాలీ నటి చేసిన ఫిర్యాదుపై కేరళ పోలీసులు రంజిత్‌పై కేసు నమోదు చేశారు.

పరిశ్రమను నాశనం చేయొద్దు: మోహన్‌లాల్
జస్టిస్ హేమ కమిటీ నివేదిక దరిమిలా పలువురు నటుటు, దర్శక నిర్మాతలపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మలయాళం మూవీ ఆర్టిస్టస్ అసోసియేషన్(అమ్మ) అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ప్రముఖ నటుడు మోహన్‌లాల్ మొదటిసారి శనివారం మౌనం వీడారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మలయాళ చిత్ర పరిశ్రమను నాశనం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. హేమ కమిటీ నివేదికను తాము స్వాగతిస్తున్నామని, కమిటీ నివేదికను బయటపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం సరైనదని ఆయన అన్నారు.

అన్ని ప్రశ్నలకు అమ్మ సమాధానం చెప్పలేదని, ఈ ప్రశ్నలు అందరి నుంచి రావలసి ఉంటుందని ఆయన అన్నారు. అందరూ కష్టపడి పనిచేసే పరిశ్రమలో అందరినీ నిందించలేమని, దర్యాప్తు కొనసాగుతున్నందున బాధ్యులైన వారిపై కఠిన చర్యలు ఉండాల్సిందేనని ఆయన చెప్పారు. తాను మలయాళ చిత్ర పరిశ్రమలోని ఏ అధికార వర్గానికి చెందిన వాడిని కానని, ఈ రంగంలో అలాంటి వర్గం ఉందని కూడా తనకు తెలియదని ఆయన చెప్పారు. ఎవరైనా తప్పు చేసినట్లు రుజువైతే వారిని కఠినంగా శిక్షించాలని ఆయన అన్నారు. మేమ కమిటీ నివేదికను తాను ఇంకా చదవలేదని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News