తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా హైదరాబాద్ లో సోమవారం అన్ని స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. జీహెచ్ఎంసీ అధికారులు కూడా సిబ్బందిని అప్రమత్తం చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు.
కాగా, బంగాళఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఇవాళ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగామ, వికారాబాద్, సంగారెడ్డిలో భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.