న్యూయార్క్: ప్రతిష్ఠాత్మకమైన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో 13వ సీడ్ ఎమ్మా నవారొ (అమెరికా), రెండో సీడ్ అరినా సబలెంక (బెలారస్) సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో నవారొ 62, 75 తేడాతో పౌలా బడోసా (స్పెయిన్)ను ఓడించింది. ఆరంభం నుంచే నవారొ దూకుడుగా ఆడింది. అద్భుత షాట్లతో ప్రత్యర్థిని హడలెత్తించిన నవారొ అలవోకగా తొలి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్‌లో ప్రత్యర్థి నుంచి కాస్త పోటీ ఎదురైనా నవారొ ఒత్తిడికి గురికాలేదు. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుంటూ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి తొలిసారి యూఎస్ ఓపెన్ సెమీస్‌కు దూసుకెళ్లింది. మరో క్వార్టర్ ఫైనల్లో సబలెంక సాధించింది.
చైనాకు చెందిన ఏడో సీడ్ జెంగ్‌తో జరిగిన పోరులో సబలెంక అలవోక విజయాన్ని అందుకుంది. ఆరంభం నుంచే చెలరేగి ఆడిన సబలెంక 61, 62తో మ్యాచ్‌ను గెలిచి ముందంజ వేసింది. ఇక పురుషుల సింగిల్స్‌లో నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్ క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టాడు. అమెరికాకు చెందిన 12వ సీడ్ ఫ్రిట్జ్ చేతిలో జ్వరేవ్ ఓటమి పాలయ్యాడు. మరోవైపు అమెరికాకు చెందిన 20వ సీడ్ ఫ్రాన్సిస్ టియఫొయె కూడా సెమీ ఫైనల్‌కు చేరుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో 9వ సీడ్ గ్రిగర్ దిమిత్రోవ్ (బల్గేరియా)ను ఫ్రాన్సిస్ ఓడించాడు.