Thursday, December 26, 2024

మోడీ పాలనలో పెరిగిన నిరుద్యోగం!

- Advertisement -
- Advertisement -

భారతదేశం అన్నిరంగాల్లో అభివృద్ధి శరవేగంగా పరుగులు పెడుతూ ఉందని, ప్రపంచంలో అతిపెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఉందని, త్వరలో ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఏర్పడనుందని, ఉపాధి పెరిగి నిరుద్యోగం, పేదరికం తగ్గిందని మోడీ ప్రభుత్వ ప్రచారం ఎంత బూటకమో దేశంలో పెరిగిన నిరుద్యోగం, తగ్గిన ఉపాధిని గమనిస్తే తెలుస్తుంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌ఒ) భారతదేశ ఉపాధి నివేదికను 2024న విడుదల చేసింది. 20002024 వరకు నిర్వహించిన సర్వేల ద్వారా భారత ప్రభుత్వ, రిజర్వు బ్యాంకు లెక్కలను, జాతీయ నమూనా సర్వేను, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ సర్వేలను ఉపయోగించి ఈ నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 2022లో ఉత్పత్తిలో శ్రామికుల వినియోగం (ఎల్‌ఎఫ్‌పిఆర్) 59.8 శాతంగా ఉంటే భారత దేశం 55.2 శాతంగా ఉంది. భారతదేశం పని చేయగల వయస్సు (15 నుంచి 59 సం) జనాభా 2011లో 59 శాతం ఉండగా, 2022 నాటికి 63 శాతానికి పెరిగింది. శ్రామికశక్తి పెరుగుదలకు అనుగుణంగా ఉపాధి లభించటం లేదు. కొద్ది మందికే పని దొరికిందని నివేదిక తెలిపింది.

స్వయం ఉపాధి గణాంకాల విభాగం విడుదల చేసిన జులై 2022 నుంచి జులై 2023 వరకు మోడీ ప్రభుత్వంలో అత్యంత వినాశకర ఉపాధి తీరు వెల్లడైంది. దేశం మొత్తం ఉపాధిలో 58% స్వయం ఉపాధి పొందుతున్నారు. 2017 -18లో వీరు 52% మాత్రమే ఉన్నారు. దీన్ని గమనిస్తే ప్రభుత్వం కల్పించే ఉపాధి లేక ప్రజలు స్వయం ఉపాధిని ఆశ్రయించటం ఎక్కువైంది. స్వయం ఉపాధి పొందుతున్నవారు చిన్నవ్యాపారులు, చేతి వృత్తిదారులే. ఆర్థిక వేత్త సంతోష్ మెహ్రోత్రా చెప్పిన దాని ప్రకారం స్వయం ఉపాధి కార్మికుల సంఖ్య 2017- 18లో 4 కోట్ల మంది ఉండగా, 2022- 23 నాటికి 9 కోట్ల, 50 లక్షలకు పెరిగింది. 92 దేశాలు అనుసరిస్తున్న అంతర్జాతీయ కార్మిక సంస్థ సూచించిన పద్ధతి ప్రకారం జీతం చెల్లించని ఇలాంటి వారిని ఉపాధి పొందిన కార్మికులుగా పరిగణించటం లేదు. దీన్ని గమనిస్తే ఉపాధి కల్పనలో ఎంతగా మోడీ ప్రభుత్వ వైఫల్యం చెందింది తెలుస్తుంది. దేశంలో వ్యవసాయ రంగం ద్వారానే ఇప్పటికీ ఎక్కువగా ఉపాధి దొరుకుతుంది. నేషనల్ శాంపిల్ సర్వే ( ఎన్‌ఎస్‌ఎస్) నివేదిక 38వ రౌండ్ (9183) నివేదిక ప్రకారం 77% గ్రామీణ కుటుంబాలు జీవనోపాధి కొనసాగించడానికి వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నాయి.

201819కి సంబంధించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే తాజా నివేదిక ప్రకారం వ్యవసాయంపై గ్రామీణ కుటుంబాలు ఆధారపడటం 53 శాతానికి తగ్గింది. జాతీయ జిడిపిలో వ్యవసాయ రంగం వాటా 43% నుంచి 16 శాతానికి తగ్గింది. అందుకు కారణం సేద్యపు ఖర్చులు పెరగడం, పంటలకు న్యాయమైన గిట్టుబాటు ధరలు లభించకపోవటం, వ్యవసాయం వల్ల వచ్చే ఆదాయం చాలకపోవటం, అప్పుల పాలు కావడం వల్ల రైతులు వేరే ఉపాధి చూసుకోవటం కారణంగా ఉంది. ఇదే క్రమంలో గమనించాల్సిన అంశం ఒకటుంది. అది మహిళల వ్యవసాయ ఉపాధి రేటు ఇప్పటికీ 82 నుండి 72 శాతానికి మాత్రమే తగ్గింది. వ్యవసాయ పనులైన నాట్లు, కోత, కలుపుతీయటం, విత్తనాలు వేయడం మొదలైన పనుల్లో మహిళల పాత్ర ఎక్కువగా ఇప్పటికీ ఉంది. మహిళల ఉపాధి కూడా కొద్ది మేర తగ్గడానికి కొన్ని ప్రాంతాల్లో యంత్రాల వినియోగంతోపాటు ప్రకృతి సృష్టిస్తున్న కరవు, వరదలు కూడా వ్యవసాయ రంగంలో ఉపాధి తగ్గడానికి కారణం. వీటిని గమనించినప్పుడు గ్రామీణ ఉపాధికి వ్యవసాయమే ప్రధానంగా ఉండి అత్యధిక గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నది.

మరో ముఖ్యమైన విషయం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. 2000 నుంచి 2012 వరకు వ్యవసాయంలో ఉపాధి పొందే వారి వాటా స్వల్పంగా తగ్గినా, కోవిడ్ కాలంలో వ్యవసాయ రంగమే ఎక్కువ ఉపాధి కల్పించింది. గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం పట్టణాలకు, నగరాలకు వలసలు వెళ్లిన పేదలు కోవిడ్ వలన ఉపాధి కోల్పోయి తిరిగి గ్రామీణ ప్రాంతాలకు వచ్చినప్పుడు వారిని వ్యవసాయ రంగం ఆదుకున్న వాస్తవాన్ని గ్రహిస్తే వ్యవసాయ రంగ ప్రాముఖ్యత తెలుస్తుంది. ఇన్‌స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలఫ్‌మెంట్ మరియు అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్తంగా రూపొందించిన ఇండియా ఎంప్లాయ్ మెంట్ రిపోర్టు 2024 ప్రకారం భారతదేశ శ్రామిక జనాభా 2011లో 61%గా ఉంటే, 2024లో 64 శాతంగా ఉంది. యువత ఉపాధి 37 శాతం క్షీణించింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఇ) తాజా వివరాల ప్రకారం మే 2024లో నిరుద్యోగం 7 శాతం కాగా, జూన్ 2024లో 9.2% కి పెరిగింది. కన్జ్యూమర్ పిరమిడ్స్ హౌస్ హోల్ సర్వే ప్రకారం జూన్ 2024లో మహిళా నిరుద్యోగం 18 శాతానికి చేరింది. ఇది జాతీయ సగటుకన్నా ఎక్కువ.

2023లో మహిళా నిరుద్యోగం 15 శాతంగా ఉంది. కార్మిక శక్తి వినియోగం 2024 మేలో 40.8% ఉంటే, జూన్‌లో 41.4 శాతానికి పెరిగింది. పట్టణ నిరుద్యోగం మే 2024లో 6.3 శాతం ఉంటే, జూన్‌లో 8.9 శాతానికి పెరిగింది. భారతదేశ ఉపాధి నివేదిక 2024 ప్రకారం నిరుద్యోగ శ్రామిక శక్తిలో దాదాపు 83% యువత ఉన్నది. మొత్తం నిరుద్యోగ యువతలో మాధ్యమిక లేక ఉన్నత విద్య పూర్తిచేసిన యువకుల వాటా 2000 సంవత్సరంలో 32.2% ఉంటే 2022లో 65.7% కి పెరిగింది. మోడీ ప్రభుత్వం ఉద్యోగ కల్పన కల్పించ పోగా ఉన్న ఉద్యోగాల్లో కూడా తగ్గించింది. ఫలితంగా నిరుద్యోగం పెరుగుతూ ఉంది. దేశం మొత్తంమీద ఉన్న 389 ప్రభుత్వ రంగ సంస్థల్లో 2014లో 16.9 లక్షల ఉద్యోగాలు ఉండగా, 2022లో ఈ సంఖ్య 14.6 లక్షలకు తగ్గింది. ఒక్క బిఎస్‌ఎన్‌ఎల్ లోనే గత 9 సంవత్సరాల్లో లక్షా 81వేల మందిని ఇంటికి పంపింది. ఈ విధంగా మోడీ ప్రభుత్వ పాలనలో ఉపాధి తగ్గి నిరుద్యోగం పెరిగింది.

బొల్లిముంత
సాంబశివరావు
9885983526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News