ఎపి మాజీ సిఎం వైఎస్ జగన్ లండన్ టూర్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో గతంలో ఇచ్చిన బెయిల్ షరతులను సడలించి మరీ హైదరాబాద్ సిబిఐ కోర్టు జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చినా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఆదేశంతో మరో సమస్య ఎదురైంది. దీంతో జగన్ ఇప్పుడు ఎపి హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా విచారణ వాయిదా పడింది. దీంతో పాస్ పోర్ట్ క్లియరెన్స్ కోసం జగన్ ప్రయత్నిస్తున్నారు. గతంలో వైఎస్ జగన్ సిఎంగా ఉన్నప్పుడు ఆయనకు నిబంధనల ప్రకారం దౌత్యపరమైన పాస్ పోర్టు లభించింది. తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆయన ఈ డిప్లమేటిక్ పాస్ పోర్టును సరెండర్ చేసి రెగ్యులర్ పాస్ పోర్టు తీసుకున్నారు. ఆయనకు ఐదేళ్ల గడువుతో రెగ్యులర్ పాస్ పోర్టు ఇవ్వాలని హైదరాబాద్ సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది.
ఇంత వరకూ బాగానే ఉన్నా విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టులో జగన్‌పై ఉన్న కేసు తలనొప్పిగా మారింది. జగన్ తెచ్చిన చట్టం ఆయనకు వర్తించదు. దీంతో తనకు ఐదేళ్ల గడువుతో రెగ్యులర్ పాస్ పోర్టు కోరుతూ విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు మాత్రం ఏడాది పాటు మాత్రమే రెగ్యులర్ పాస్ పోర్టు తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ జగన్ ఎపి హైకోర్టును ఆశ్రయించారు. ఐదు సంవత్సరాలకు పాస్ పోర్ట్ ఇవ్వాలని హైకోర్టులో జగన్ లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. దీంతో జగన్ తన లండన్ ప్రయాణం వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు తీసుకునే నిర్ణయాన్ని బట్టి జగన్ లండన్ ప్రయాణం ఆధారపడనుంది.